వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం
1 min read
తెలంగాణ ఎన్నికల బరి నుంచి వైఎస్ షర్మిల తప్పుకున్నారు. వైఎస్ఆర్టీపీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆమె ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు షర్మిల తెలిపారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయని షర్మిల తేల్చి చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యతిరేక ఓటు ను చీల్చితే చరిత్ర క్షమించదని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు ఓడించడం తమ ఉద్దేశం కాదన్నారు. సోనియా, రాహుల్ గాంధీ పైన అపార గౌరవముందని షర్మిల అన్నారు.
కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయడానికి షర్మిల తీవ్రంగా ప్రయత్నించారు.అయితే చర్చలు ఫలించలేదు. పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు సూచించింది. కానీ పాలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని షర్మిల పట్టుపట్టారు. దీంతో విలీన ప్రక్రియ ను కాంగ్రెస్ పక్కన పెట్టింది. ఇదే సమయంలో షర్మిల సొంతంగా పోటీకి సిద్ధమయ్యారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడం తో చివరకు పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థులు కరువు కావడం, జనం ఆదరణ పెద్దగా లేకపోవడంతో షర్మిల ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పాలేరు నుంచి పోటీ చేయడానికి సిద్ధమైన ఆమె కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉండటంతో పునరాలోచనలో పడ్డారు. అక్కడ కూడా పరిస్థితి మెరుగు గా లేకపోవడంతో చివరకు చేతులెత్తేశారు.