ఖర్గేకు జరిగిన అవమానం దేశంలోని దళితుల ఆత్మగౌరవానికి అవమానం:భట్టి విక్రమార్క

న్యూఢిల్లీ:
రాజ్యాంగంపై నమ్మకం లేకే దళితులపై వివక్ష: భట్టి విక్రమార్క
ఖర్గేకు జరిగిన అవమానం దేశంలోని దళితుల ఆత్మగౌరవానికి అవమానం
బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీలను రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారు
ఆత్మగౌరవం కోసం దేశవ్యాప్తంగా ఐక్యంగా పోరాడాలి: డిప్యూటీ సీఎం
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ, దళితులు, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు దేశవ్యాప్తంగా ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత–ఆదివాసీ ఆత్మగౌరవ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
దేశానికి సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, అస్పృశ్యత నిర్మూలన వంటి విలువలను అందించిన రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అస్పృశ్యతకు వ్యతిరేకంగా తొలి తీర్మానం ఆమోదించబడిందని, అనంతరం రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని ఆయన గుర్తుచేశారు.
ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి భారత రాజ్యాంగంపై నమ్మకం లేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. రాజ్యాంగానికి బదులుగా మనుస్మృతి, మను ధర్మశాస్త్ర భావజాలాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. “దేశంలోని ప్రతి పౌరుడినీ ఒక్కటిగా నిలబెట్టేది భారత రాజ్యాంగమే. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అంటే దేశ పునాదులనే దెబ్బతీయడం” అని భట్టి వ్యాఖ్యానించారు. దళితులు, ఆదివాసీలపై వివక్షకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే పలు చట్టాలు తీసుకువచ్చామని, అయినప్పటికీ నేటికీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని అన్నారు.
ఖర్గేకు జరిగిన ఘటనపై ఆగ్రహం
మల్లికార్జున ఖర్గే కేవలం దళిత నాయకుడు మాత్రమే కాదని, సుదీర్ఘ రాజకీయ పోరాటంతో దేశంలో అత్యున్నత పదవులను అధిరోహించిన నాయకుడని భట్టి అన్నారు. కర్ణాటకలో మంత్రిగా, సీఎల్పీ నేతగా, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన ఖర్గే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారని గుర్తుచేశారు. అలాంటి నాయకుడి సభ అనంతరం హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ కార్యక్రమం నిర్వహించడం దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన తీవ్రమైన అంశమని భట్టి పేర్కొన్నారు.
రాహుల్ గాంధీపై కేసు ఎందుకు?: భట్టి
ఖర్గేకు జరిగిన ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ నిరసన చేపడితే, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆయనపైనే కేసు పెట్టారని భట్టి విక్రమార్క విమర్శించారు. “అవమానానికి గురైన వ్యక్తికి న్యాయం చేయాలని ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారిపైనే కేసులు పెడుతున్నారు. ఇది దళితులు, ఆదివాసీల పట్ల వ్యవస్థలో ఉన్న వివక్షను బయటపెడుతోంది” అని ఆయన అన్నారు.
20 కోట్ల మంది ఎస్సీలను పట్టించుకోరా?
దేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన కోట్లాది మంది ప్రజలు ఉన్నారని భట్టి పేర్కొన్నారు. వారందరూ సమాన హక్కులు, గౌరవంతో జీవించేలా రాజ్యాంగం కల్పించిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. “ఎస్సీలు, ఆదివాసీలు, మైనారిటీలు సహా కోట్లాది మందిని రెండో తరగతి పౌరులుగా చూసే పరిస్థితిని మనం అంగీకరించకూడదు. అందరం ఒక్కతాటిపైకి వచ్చి ఆత్మగౌరవం కోసం పోరాడాలి” అని పిలుపునిచ్చారు. దళిత, ఆదివాసీ వర్గాలపై జరిగే వివక్ష, అవమానాలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని భట్టి అన్నారు.
“ప్రతి రాష్ట్రానికి వెళ్దాం.. ప్రజలను చైతన్యపరుద్దాం.. మన ఆత్మగౌరవం కోసం పోరాడుదాం. ఎలాంటి అవమానాన్ని సహించబోం” అని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తీసుకొచ్చిన సామాజిక న్యాయ చట్టాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని భట్టి అన్నారు. దళిత, ఆదివాసీ, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ జెండా కింద ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.
#BhattiVikramarka #MallikarjunKharge #Kharge #DalitSelfRespect #DalitDignity #Congress #TelanganaCongress #TelanganaPolitics #PoliticalNews #VSRBreakingNews #Todaysbreaking.in
