తెలంగాణ‌ విద్యుత్ కేంద్రాల‌కు సింగ‌రేణి బొగ్గు స‌ర‌ఫ‌రా..

జెన్‌కో కేంద్రాలకు రోజుకు 75,500 టన్నుల బొగ్గు సరఫరాకు కార్యాచరణ
ఎల్‌ నినో పరిస్థితుల నేపథ్యంలో సింగరేణి, జెన్‌కో సీఎండీల ప్రత్యేక సమీక్ష
ప్లాంట్ల వారీ అవసరాలు, రైల్వే రేకులు, రవాణా సమస్యలపై చర్చ

రాష్ట్రంలో ఎల్‌ నినో పరిస్థితుల నేపథ్యంలో పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేసేందుకు సింగరేణి, తెలంగాణ జెన్‌కో సంస్థలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాయి. రోజుకు 75,500 టన్నుల బొగ్గు సరఫరా లక్ష్యంపై మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన ప్రత్యేక సమన్వయ సమావేశంలో చర్చించాయి.
సింగరేణి సీఎండీ డాక్టర్‌ బుద్ధ ప్రకాష్‌ జ్యోతి, తెలంగాణ జెన్‌కో సీఎండీ డాక్టర్‌ హరీష్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సింగరేణి ఏరియా జనరల్‌ మేనేజర్లు, జెన్‌కో విద్యుత్‌ కేంద్రాల చీఫ్‌ ఇంజినీర్లు, ఇరు సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్‌ కేంద్రాల వారీగా బొగ్గు అవసరాలు, ప్రస్తుతం జరుగుతున్న సరఫరా, బొగ్గు నాణ్యత, రైల్వే రేకుల అందుబాటు, లోడింగ్‌–అన్‌లోడింగ్‌, రవాణాలో ఎదురవుతున్న ఇబ్బందులను సమీక్షించారు.
రైలు మార్గంలో 56 వేల టన్నులు
రోజుకు 14 రైల్వే రేకుల ద్వారా 56 వేల టన్నులు, రోడ్డు మార్గంలో 19,500 టన్నులు సరఫరా చేసే ప్రణాళికపై సమావేశంలో చర్చించారు. కొత్తగూడెం విద్యుత్‌ కేంద్రానికి రోజుకు 24 వేల టన్నులు, కాకతీయకు 4,500 టన్నులు, భద్రాద్రికి 15 వేల టన్నులు, యాదాద్రికి 34 వేల టన్నుల బొగ్గు అవసరాలపై కేంద్రాల వారీగా సమీక్షించారు. యాదాద్రికి సరఫరా కోసం ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌ నుంచి రెండు రేకుల ద్వారా రోజుకు 8 వేల టన్నులు, స్థానిక సింగరేణి గనుల నుంచి ఆరు రేకుల ద్వారా 36 వేల టన్నులు రవాణా చేసే అంశంపై కార్యాచరణ రూపొందించారు. నైనీ నుంచి సరఫరా పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు సింగరేణి అధికారులు తెలిపారు.
గత ఏడాదితో పోలిస్తే 31 శాతం పెరుగుదల
ఈ నెలలో 28వ తేదీ నాటికి జెన్‌కో విద్యుత్‌ కేంద్రాలకు రోడ్డు, రైలు మార్గాల్లో కలిపి 15.02 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేసినట్లు సింగరేణి మార్కెటింగ్‌ శాఖ అధికారులు వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబరులో ఇదే కాలంలో 11.44 లక్షల టన్నులు మాత్రమే సరఫరా కాగా, ఈసారి 3.58 లక్షల టన్నులు, అంటే సరఫరా సుమారు 31 శాతం పెరిగిందని వివరించారు. ఎల్‌ నినో నేపథ్యంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులతో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని, ఉత్పత్తికి అనుగుణంగా మరింత బొగ్గు అవసరమని జెన్‌కో అధికారులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.
బొగ్గు సరఫరా, రవాణా, స్వీకరణలో ఎదురయ్యే సమస్యలను సంబంధిత ఏరియా జీఎంలు, విద్యుత్‌ కేంద్రాల సీఈలు పరస్పర సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని సమావేశంలో సూచించారు. ఇందుకోసం ఫోన్‌, వాట్సప్‌ గ్రూపుల ద్వారా రోజువారీ సమాచార మార్పిడి కొనసాగించాలని, రేకుల సమీకరణతో పాటు లోడింగ్‌, అన్‌లోడింగ్‌ ప్రక్రియలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా నాణ్యమైన బొగ్గు సరఫరా జరిగేలా ఇరు సంస్థలు కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. ఈ తరహాలో ప్లాంట్ల సీఈలు, బొగ్గు సరఫరా చేసే ఏరియాల జీఎంలతో సంయుక్త సమన్వయ సమీక్ష నిర్వహించడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.

 

#Singareni #SingareniCoal #Telangana #TelanganaPower #CoalSupply #PowerGeneration #TelanganaNews #SingareniCollieries #EnergyNews #VSRBreakingNews #Todaysbreaking.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn