బీఆర్ఎస్ లోకి ఏపూరి సోమన్న
1 min readతెలంగాణ గాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల పార్టీలో ఉన్న ఆయన తాజాగా మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. త్వరలోనే గులాబీ కండువా వేసుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏపూరి సోమన్న వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. కేసీఆర్ పాలన ను వ్యతిరేకిస్తున్న అనేక పాటలు పాడారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. తుంగతుర్తి సీటు ఆశిస్తు ఆయన షర్మిల పార్టీలో చేరారు. వైఎస్ ఆర్ టీపీ తొలి అభ్యర్థిగా ఏపూరి సోమన్నను షర్మిల ప్రకటించారు కూడా. అయితే ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో ఏపూరి అసంతృప్తిగా ఉన్నారు. తమతో మాట మాత్రం చెప్పకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. కనీసం షర్మిలను కలవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని ఏపూరి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే షర్మిల పార్టీకి గుడ్ బై చెప్పాలని ఆయన నిర్ణయించుకున్నారు.
సాయి చంద్ మరణం తర్వాత బీఆర్ఎస్ సాంస్కృతిక విభాగం బాగా బలహీనపడింది. పార్టీ వేదికలపైన బలమైన కళాకారులు కరువయ్యారు. దీంతో ఆ పార్టీ మంచి గాయకుడి కోసం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ఏపూరి సోమన్నను తమ వైపు తిప్పుకున్నట్లు సమాచారం. ఇక ముందు బీఆర్ఎస్ సభలు, సమావేశాల్లో ఏపూరి పాట వినే అవకాశం ఉంది.