*ఆగస్ట్ 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు

రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆగస్టు 15న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రాష్ట్రస్థాయి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
సంగారెడ్డిలో రాష్ట్రస్థాయి కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే మిగిలిన 32 జిల్లా కేంద్రాల్లో కూడా మధ్యాహ్నం 2 గంటలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రజా ప్రభుత్వం ఇప్పటివరకు 16.32 లక్షల కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. అదనంగా 61.09 లక్షల మంది ఆహార భద్రత పరిధిలోకి వచ్చారు.
కొత్త కార్డుల మంజూరుతో తెలంగాణలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 1.05 కోట్లకు చేరగా, 3.42 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత లభిస్తోంది.
రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ప్రతి నెల సుమారు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.
ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచి, లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించేందుకు సురక్షితమైన, ట్యాంపర్ ప్రూఫ్ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం సిద్ధం చేసింది.
జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ప్రణాళిక, సమన్వయం, అమలు బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు.
పౌరసరఫరాలు, రెవెన్యూ, పోలీసు శాఖలతో పాటు ఇతర సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు ఇచ్చారు.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ముందు జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాలను ఖరారు చేసి, పూర్తిస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్లను ఆదేశించారు.
పంపిణీకి సిద్ధంగా ఉన్న లామినేటెడ్ స్మార్ట్ రేషన్ కార్డులను భద్రంగా ఉంచడంతో పాటు సురక్షితంగా రవాణా చేసి, పంపిణీ కేంద్రాలకు సకాలంలో చేరేలా చూడాలని ఆదేశించారు.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరినీ అధికారికంగా ఆహ్వానించి, కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు.
స్మార్ట్ రేషన్ కార్డుల కోసం వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, వివరాల ధ్రువీకరణ, కార్డుల పంపిణీ ప్రక్రియ క్రమబద్ధంగా జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు సూచించారు.
రేషన్ కార్డుల పంపిణీ సందర్భంగా లబ్ధిదారులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పురోగతిని ప్రతిరోజూ పర్యవేక్షించి, రోజువారీ పంపిణీ వివరాలను పౌరసరఫరాల కమిషనర్‌కు నివేదించాలని కలెక్టర్లను ఆదేశించారు.
జిల్లాల్లో మొత్తం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు.
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమంగా చేపట్టాలని అన్ని జిల్లాల కలెకర్లకు సీఎస్ సంజయ్ జాజు సర్క్యులర్ జారీ చేశారు.
