పెట్టుబడులకు తెలంగాణే గమ్యస్థానం..అమెరికాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు

పెట్టుబడులకు తెలంగాణే గమ్యస్థానం

బే ఏరియా పారిశ్రామికవేత్తలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు

కొత్త ఆలోచనలతో రండి.. ప్రభుత్వంతో కలిసి నడవండి

డిప్యూటీ సీఎం గౌరవార్థం భారత కాన్సుల్ జనరల్ ప్రత్యేక విందు

అమెరికా పర్యటనలో ప్రవాస భారతీయులతో సమావేశం

పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు తెలంగాణ రాష్ట్రాన్ని తమ తొలి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన గౌరవార్థం శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్ కె. శ్రీకర్ రెడ్డి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బే ఏరియాలోని ప్రముఖ ప్రవాస భారతీయులతో పాటు ఐటీ, వైద్య, మానవ వనరులు, ఇతర వ్యాపార రంగాలకు చెందిన విశిష్ట నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు.

ఐటీ, ఆవిష్కరణల్లో హైదరాబాద్ అగ్రగామి టెక్నాలజీ, ఇన్నోవేషన్, లైఫ్ సైన్సెస్ మరియు గ్లోబల్ సర్వీసెస్ రంగాలలో భారతదేశపు ప్రముఖ కేంద్రాలలో ఒకటిగా హైదరాబాద్ ఎదుగుతోందని  ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ వృద్ధి వేగాన్ని ఇలాగే కొనసాగిస్తూనే, అభివృద్ధి చెందుతున్న సరికొత్త రంగాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కోసం కొత్త పునాదులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

తమ ప్రభుత్వం పారదర్శకమైన, పెట్టుబడులకు అనుకూలమైన ప్రగతిశీల అభివృద్ధి నమూనాను అనుసరిస్తోందన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ, జవాబుదారీతనం కలిగిన పరిపాలన తెలంగాణ సొంతమని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త ఆలోచనలను సంస్థలుగా మార్చడంలో, నాణ్యమైన ఉపాధిని సృష్టించడంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అడుగులు వేయాలని పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు.

యువత భవిష్యత్ కోసం ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు కీలక కార్యక్రమాలను ఉప ముఖ్యమంత్రి సభకు వివరించారు. చారిత్రక మూసీ నది పునరుద్ధరణ, సమగ్ర పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. తెలంగాణ యువతను భవిష్యత్ ఉద్యోగాలకు, ప్రపంచస్థాయి పోటీకి సన్నద్ధం చేసేందుకు ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’తో పాటు అత్యాధునిక నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలి:
కాన్సుల్ జనరల్ అంతకుముందు సభికులకు స్వాగతం పలికిన కాన్సుల్ జనరల్ శ్రీకర్ రెడ్డి.. ప్రవాస భారతీయులు, ప్రభుత్వాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. భారత దేశంలో సమ్మిళిత ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడుతూనే, ప్రవాసులకు సైతం ప్రయోజనం చేకూర్చేలా బలమైన భాగస్వామ్యాలను అన్వేషించాలని వ్యాపార వర్గాలను కోరారు.

ఈ సమావేశం అనంతరం.. పెట్టుబడులు, సాంకేతిక సహకారం, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, ఆవిష్కరణలు తదితర అంశాలపై ఎన్నారైలు, బే ఏరియా ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రంతో అమెరికాలోని ప్రవాస భారతీయుల మధ్య బలమైన సంస్థాగత సంబంధాలు ఏర్పరచుకునే దిశగా ఈ సదస్సులో అర్థవంతమైన చర్చలు జరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn