జన్వాడ భూములపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు

హైదరాబాద్:

అధికార దుర్వినియోగంతోనే జ‌న్వాడ ఫామ్ హౌస్ ను కేటీఆర్ సంపాదించార‌ని కాంగ్రెస్ ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జ‌న్వాడ ఫామ్ హౌస్ పైన అనేక అనుమానాలున్నాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జ‌న్వాడ ఫామ్ హౌస్ వ‌ద్ద‌కు వెళ్లి ప‌రిశీలించారు. భూముల వ్యవహారంపై హైడ్రా కమిషనర్, మున్సిపల్ కమిషనర్‌తో ఎంపీ చామ‌ల కిర‌ణ్ ఫోన్ లో అక్క‌డి నుంచే మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు. ప్రైవేటు భూముల్లోకి వెళ్లాలనే ఉద్దేశం తమకు లేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్ కుటుంబం అధికారంలో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిందనే ఆరోపణలను ప్రజలకు వివరించేందుకే తాము జన్వాడకు వచ్చామని తెలిపారు.

 

జన్వాడ ఫామ్‌హౌస్‌కు సంబంధించి ప్రదీప్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూ చామల కిరణ్ కుమార్ రెడ్డి పలు ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో ప్రదీప్ రెడ్డిపై డ్రోన్ కేసు నమోదైందని, ప్రస్తుతం ఆయనే ఫామ్‌హౌస్ తనదని చెబుతున్నారని అన్నారు.ప్రదీప్ రెడ్డి కేటీఆర్ తన ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారని చెబుతున్నారని, కేటీఆర్‌కు ఆయనకు మధ్య లీజ్ లేదా ఇతర ఒప్పందానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయా అని చామల ప్రశ్నించారు. ఫామ్‌హౌస్ యాజమాన్యం, లీజ్ వ్యవహారం అధికారిక పత్రాలతో స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు. జన్వాడలోని భూములు సత్యం రామలింగరాజుకు సంబంధించిన కంపెనీ అయిన శతభిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినవని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆ కంపెనీకి సంబంధించిన షేర్లు, భూములపై గతంలో ఈడీ, ఐటీ శాఖల చర్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.301, 311, 313 సర్వే నంబర్లలోని భూములు కేటీఆర్ బాల్య మిత్రుడు, ఇతర వ్యక్తుల పేర్లకు బదలాయించబడ్డాయని ఆయన ఆరోపించారు. డీఎన్‌బీ అనే కంపెనీకి కూడా భూములు బదలాయించారని, ఈ వ్యవహారంలో డి. రాజేష్ అనే వ్యక్తి పేరు ఉందని పేర్కొన్నారు.ఈ భూములపై ఈడీ, ఐటీ కేసులు ఉన్నప్పటికీ 13 ఎకరాల భూములు ఎలా విడుదలయ్యాయి? అవి ప్రదీప్ రెడ్డి పేరుకు ఎలా బదలాయించబడ్డాయో కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని చామల డిమాండ్ చేశారు.

జన్వాడ ఫామ్‌హౌస్ ఫిరంగి నాలాను ఆక్రమించి నిర్మించారని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఫామ్‌హౌస్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు తీసుకోలేదని, అది అక్రమ నిర్మాణమని పేర్కొన్నారు.ఫామ్‌హౌస్ 111 జీవో పరిధిలో ఉందని, నాళా ఆక్రమణకు సంబంధించిన అంశాలపై కూడా అధికారులు పరిశీలన చేయాలని ఆయన అన్నారు. ప్రదీప్ రెడ్డికి జూలైలో హైడ్రా నోటీసులు ఇచ్చిందని తెలిపారు.కేటీఆర్ గతంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నాళా ఆక్రమణకు సంబంధించిన ఫామ్‌హౌస్‌లో ఎలా నివసించారని చామల ప్రశ్నించారు.

సర్వే నంబర్ 301లో కేటీఆర్ సతీమణి శైలిమ పేరుతో 3 ఎకరాల 2 గుంటల భూమి ఉందని చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే కేటీఆర్ అత్త పాకాల శశిరేఖ పేరుతో 18 గుంటల భూమి ఉందని తెలిపారు.ఈ భూములన్నీ గతంలో సత్యం రామలింగరాజుకు సంబంధించిన కంపెనీ భూములేనని ఆయన ఆరోపించారు. ఐటీ ట్రిబ్యునల్‌లో కేసు కొనసాగుతున్న సమయంలో భూములు ఎలా బదలాయించబడ్డాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, ప్రదీప్ రెడ్డి మధ్య ఫామ్‌హౌస్‌కు సంబంధించి ఎలాంటి లీజ్ అగ్రిమెంట్ లేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. భూముల యాజమాన్యం, బదలాయింపులు, ఫామ్‌హౌస్ నిర్మాణ అనుమతులు, లీజ్ ఒప్పందంపై అధికారిక రికార్డులను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn