బహుజనుల బాణాన్ని.. యువత యుద్ధ నినాదాన్ని .. కల్వకుంట్ల కవిత

కోస్గి–కొడంగల్: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కోస్గిలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బహుజన రాజ్యం రావాలంటే కాంగ్రెస్‌ను గద్దె దించాల్సిందేనని ఆమె అన్నారు.తాను కాంగ్రెస్‌ బాణాన్ని కాదని, బీఆర్‌ఎస్‌ లేదా బీజేపీ బాణాన్ని కాదని.. “నేను బహుజనుల బాణాన్ని.. యువకుల యుద్ధ నినాదాన్ని” అని కవిత వ్యాఖ్యానించారు. అంబేడ్కర్‌ వాదాన్ని, పూలే ఆత్మగౌరవాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాజకీయ పోరాటం చేస్తున్నానని తెలిపారు.

“మీరు ఆశీర్వదిస్తే మోడీ, కేసీఆర్‌, రేవంత్‌రెడ్డితో పోరాడుతా. ఎవరి మద్దతు లేకుండా ఒక మహిళ రాజకీయంగా ఎదగగలదని నిరూపిస్తా” అని ఆమె అన్నారు.తెలంగాణలో విద్యా వ్యవస్థ పరిస్థితిపై కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఊరికి ఒక పాఠశాల, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలని అన్నారు. తెలంగాణలోని ప్రతి బిడ్డను చదివించే బాధ్యత తనకు అప్పగిస్తే తీసుకుంటానని చెప్పారు.ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించడమే లక్ష్యమని తెలిపారు. ఎంత పెద్ద అనారోగ్యం వచ్చినా ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే భరించే విధంగా వ్యవస్థను రూపొందిస్తామని చెప్పారు.యువతను నమ్ముతామని, వారి వ్యాపార ఆలోచనలను ప్రోత్సహిస్తామని కవిత అన్నారు. యువత బిజినెస్ ఐడియాను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

పాలమూరు నీటిపై కవిత వ్యాఖ్యలు

మహబూబ్‌నగర్‌ జిల్లాలో కృష్ణా, తుంగభద్ర తదితర నదులు ఉన్నప్పటికీ ప్రజలకు తగినంత నీరు అందడం లేదని కవిత విమర్శించారు. జూరాల నుంచి నీటిని తీసుకుని పాలమూరు–రంగారెడ్డి ప్రాంతంలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు.“జూరాల నుంచి నీళ్లు తీసుకుని ఇబ్రహీంపట్నం వరకు పది లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తా.. లేదంటే నా పేరు మార్చుకుంటా” అని ఆమె వ్యాఖ్యానించారు.

తెలంగాణలో సామాజిక అన్యాయం కొనసాగుతోందని కవిత ఆరోపించారు. ముదిరాజ్‌, ముస్లిం, నేతన్న, గీతన్న వర్గాలకు వారి జనాభాకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు. మహిళలకు రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా తప్పించుకుంటోందని కవిత ఆరోపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌కు ప్రజలు ఇచ్చిన రాజకీయ ప్రాతినిధ్యంపై కూడా ఆమె విమర్శలు చేశారు.కొడంగల్ ప్రజల ఆశీర్వాదంతో భవిష్యత్తులో తెలంగాణను నడిపించే స్థాయికి ఎదుగుతానన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. తన పార్టీ తెలంగాణ ప్రజల కోసం, బహుజనులు మరియు యువతకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు పనిచేస్తుందని  కవిత చెప్పారు.

 

#KalvakuntlaKavitha #Kavitha #KavithaSpeech #Kosgi #Kodangal #TelanganaPolitics #TelanganaNews #TelanganaPoliticalNews #TelanganaRakshanaSena #PanchajanyaSankalpaSabha #BahujanRajyam #RevanthReddy #KCR #Modi #Mahabubnagar #Palamuru #Jurala #TelanganaYouth #TelanganaFarmers #Congress #TelanganaNewsTelugu #VSRBreakingNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn