మెత్తబడ్డ ముత్తిరెడ్డి ..పల్లా కు జై
1 min readబీఆర్ఎస్ లో జనగామ టికెట్ పంచాయతీ ముగిసింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య రాజీ కుదిరింది. మంత్రి కేటీఆర్ ఇద్దరు నేతలతో పాటు ఇతర నాయకులతో సమావేశమయ్యారు. ముత్తిరెడ్డి,పల్లా మధ్య ఆయన సయోధ్య కుదిర్చారు. కలిసి పనిచేస్తామని ఇద్దరు నాయకులు స్పష్టం చేశారు. జనగాం టికెట్ ను పల్లా రాజేశ్వర్ రెడ్డి కి బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. అయితే తన కే టికెట్ ఇవ్వాలని సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ఆర్టీసీ చైర్మన్ గా సీఎం కేసీఆర్ నియమించారు. ఇటీవలె చైర్మన్ ఆయన బాధ్యత లు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ తన కే జనగాం టికెట్ అని ముత్తిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఇద్దరు నేతలతో సమావేశమై వివాదానికి ముగింపు పలికారు.
జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ముత్తిరెడ్డి పూర్తి స్థాయిలో మద్దతునిస్తారో లేదో చూడాల్సి ఉంది. సహకరిస్తానని చెపుతున్నప్పటికీ లోలోన మాత్రం ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత రెండు సార్లు జనగాం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గా ముత్తిరెడ్డి విజయం సాధించారు. అయితే గత కొన్నాళ్ల నుంచి ఆయన వివాదాల్లో ఉంటూ వస్తున్నారు. స్వయంగా ఆయన కూతురే ముత్తిరెడ్డి పైన తిరుగుబాటు చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి తన పేరు మీద రిజిస్టర్ చేయించారంటూ ఆమె ఆరోపించారు. ఆ భూమిని మున్సిపాలిటీ కి అప్పగించారు. ప్రతి కార్యక్రమంలో ముత్తిరెడ్డి ని బహిరంగంగా నిలదీయడంతో ఆయన ఇరుకున పడ్డారు. తన కార్యక్రమాలకు ఆమె అడ్డుపడకుండా ఆపాలంటూ ముత్తిరెడ్డి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వొద్దని నిర్ణయించారు.