ఖైర‌తాబాద్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా దానం నాగేంద‌ర్.. గెలుపు న‌ల్లేరుపైన న‌డ‌కే

హైదరాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ మొదలైంది. సుప్రీంకోర్టు దానం నాగేందర్ అనర్హతపై ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. దానం నాగేందర్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆయనే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండబోతున్నారు. దానం నాగేందర్‌కు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బ్యాక్‌గ్రౌండ్ వర్క్‌ను ప్రారంభించింది. దానం నాగేందర్ అభ్యర్థిత్వం కాంగ్రెస్‌కు బాగా కలిసి రాబోతుంది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ విజయం సాధించారు. ఆయనకు 67,368 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి పి. విజయారెడ్డికి 45,358 ఓట్లు, బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డికి 38,094 ఓట్లు వచ్చాయి. దానం నాగేందర్ సొంత ఇమేజ్‌తో పాటు కాంగ్రెస్ ఓట్లు కూడా కలిసి వస్తే ఆయన విజయాన్ని ఆపడం సాధ్యం కాదని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దానం నాగేందర్ ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆసిఫాబాద్ నుంచి మూడు సార్లు, ఖైరతాబాద్ నుంచి మూడు సార్లు ఆయన శాసనసభ్యుడిగా విజయం సాధించారు. దీంతో ఈ ప్రాంతంపై ఆయనకు తిరుగులేని పట్టు ఉంది. ముఖ్యంగా ఖైరతాబాద్ బస్తీల్లో దానం నాగేందర్ తెలియని వారుండరు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు వచ్చాయి. ఈ రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలుపొందారు. ఈ రెండు సిట్టింగ్ సీట్లు బీఆర్ఎస్‌వి కావడం విశేషం. త్వరలో రాబోయే ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కే విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇక్కడ ఆ పార్టీకి సరైన అభ్యర్థి కూడా కనిపించడం లేదు. దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడంతో ఇక్కడ గులాబీ పార్టీకి నాయకత్వం లేకుండా పోయింది. దీంతో ఉపఎన్నిక అభ్యర్థిపై ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. దానం నాగేందర్‌ను ఢీకొట్టే స్థాయి నాయకుడి కోసం కేసీఆర్ టీం వెతుకుతోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని సాయి కిరణ్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే సాయి కిరణ్‌ను ఖైరతాబాద్‌కు తీసుకువస్తే స్థానిక బీఆర్ఎస్ నాయకులు సహకరించే అవకాశం లేదు. ఓడిపోయే సీటు నుంచి తన కొడుకును పోటీ చేయించడానికి తలసాని ముందుకు వస్తారా? రారా? అన్నది కూడా చూడాల్సి ఉంది.

మరో వైపు బీజేపీ కూడా ఖైరతాబాద్ ఉపఎన్నికపై దృష్టి సారించింది. గతంలో ఈ సీటును బీజేపీ ఒకసారి గెలుచుకుంది. అయితే తెలుగుదేశం పొత్తు కారణంగా బీజేపీ తరఫున చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఇక్కడ విజయం సాధించగలిగారు. రాబోయే ఉపఎన్నికలో కూడా ఆయనే బీజేపీ అభ్యర్థి కాబోతున్నారు. అయితే సొంతంగా ఈ సీటును గెలిచే బలం బీజేపీకి ఎంతమాత్రం లేదు. అయితే గట్టిగా పోరాటం వల్ల రెండో స్థానం దక్కించుకుంటే రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను దెబ్బతీయవచ్చునని కమలనాథులు అంచనా వేస్తున్నారు.

 

#Khairatabad #KhairatabadBypoll #DanamNagender #KhairatabadElection #TelanganaPolitics #TelanganaNews #HyderabadPolitics #CongressTelangana #BRS #BJP #PallaVijayaReddy #DanamNagenderNews #TelanganaByElection #HyderabadNews #TelanganaLatestNews #VSRBreakingNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn