రాజ‌ధానిలో తాగు నీటి స‌మ‌స్య రాకూడ‌దు…ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

 

* క్యూర్ ఏరియాలో ఎస్టీపీలు వంద శాతం పని చేయాలి
* భవన నిర్మాణాల్లో శుద్ది చేసిన నీరు వినియోగించాలి
* తాగు నీరు స‌ర‌ఫ‌రా, ఎస్టీపీలపై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌, అక్టోబ‌రు 28: రాజ‌ధాని న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా
చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగు నీటి స‌ర‌ఫ‌రా విష‌యంలో అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం సూచించారు. రిజ‌ర్వాయ‌ర్లలో నీటి నిల్వ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ ఉండాల‌న్నారు. క్యూర్ ఏరియాలో మంచినీటి స‌ర‌ఫ‌రా, ఎస్టీపీల నిర్మాణం, ట్రీటెడ్ వాట‌ర్ వినియోగంపై ఎంసీఆర్ హెచ్ ఆర్డీ బోధి పెవిలియ‌న్ లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బుధ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఎల్ నినో నేప‌థ్యంలో భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని క్యూర్ ఏరియాలోని మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) వంద శాతం సామర్థ్యంతో పని చేసేలా చూడాల‌ని సీఎం ఆదేశించారు. శుద్ది చేసిన నీటిని సెక్ర‌టేరియ‌ట్ తో పాటు సీఎంవో, అవుట‌ర్ రింగ్ , మైట్రో రైల్ , ఇత‌ర శాఖ‌ల‌ కార్యాల‌యాల్లో పచ్చదనం నిర్వహణ, ఇత‌ర అవ‌స‌రాల‌కు వినియోగించేలా చూడాల‌ని సీఎం తెలిపారు. ప‌బ్లిక్ పార్క్ లు, రోడ్ల శుభ్ర‌త కు కూడా ట్రీటెడ్ వాట‌ర్ నే వాడాల‌న్నారు. భ‌వ‌న నిర్మాణంలో శుద్ది చేసిన నీటినే వాడాల‌నే నిబంధ‌న‌ను క‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ప్రైవేట్ ఎస్టీపీల ఏర్పాటును ప్రోత్సహించాలని, డేటా సెంటర్లకూ శుద్ధి చేసిన నీటిని స‌ర‌ఫ‌రా చేయాల‌ని సీఎం ఆదేశించారు. ఎస్టీపీల నిర్వహణకు సోలార్ విద్యుత్‌ను వినియోగించే అవకాశాలను ప‌రిశీలించాల‌ని ముఖ్య‌మంత్రి రెడ్కో ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు.

ఎస్టీపీల్లో నీటి శుద్దికి అత్యాధునిక సాంకేతిక ప్ర‌మాణాలు పాటించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. నీటి నాణ్యత విష‌యంలో ఏ మాత్రం రాజీ ప‌డొద‌న్నారు. ప్రతి శుద్ధి కేంద్రం వద్ద ప్రత్యేక అధికారిని నియమించాలని, అన్ని ప్లాంట్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఈ కేంద్రాల పనితీరును ఎప్ప‌టికిప్పుడు హైడ్రా పర్యవేక్షించాల‌న్నారు. ట్రీటెడ్ వాటర్ సరఫరా చేసే ట్యాంకర్లను ట్రాక్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఈ నీటి వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ట్రీటెడ్ వాటర్ కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్టీపీల నిర్వహణ, ట్రీటెడ్ వాటర్ వినియోగానికి సంబంధించి నవంబర్ 1 నుంచి ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ప్ర‌స్తుతం 26 ఎస్టీపీల్లో ట్రీటెడ్ వాట‌ర్ ను గ్రీన్ ట్యాంక‌ర్స్ ద్వారా పంపిణీ చేస్తున్న‌ట్లు జ‌ల‌మండ‌లి అధికారులు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి తెలిపారు. వినియోగ‌దారుల నుంచి కేవ‌లం ర‌వాణా రుసుం మాత్ర‌మే వ‌సూలు చేస్తున్నామ‌ని, నీళ్లను ఉచితంగా అందిస్తున్న‌ట్లు తెలిపారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, టీజీఎస్‌పీడీసీఎల్ ఎండీ జితేష్ వి. పాటిల్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి రవి, సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

#RevanthReddy #TelanganaCM #Hyderabad #DrinkingWater #WaterSupply #WaterCrisis #TelanganaNews #HyderabadNews #TelanganaGovernment #VSRBreakingNews

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn