మహారాష్ట్ర సీఎంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తుమ్మిడిహెట్టి బ్యారేజీపై కీలక చర్చ.. 150 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర సీఎం అంగీకారం?
ముంబై: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ముంబైలో సమావేశమయ్యారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం, దాని ఎత్తుకు సంబంధించిన అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించినట్లు సమాచారం.ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీని ఏ ఎత్తులో నిర్మించాలనే అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
150 మీటర్ల ఎత్తుపై చర్చ
తుమ్మిడిహెట్టి బ్యారేజీని 150 మీటర్ల ఎత్తులో నిర్మించే ప్రతిపాదనపై ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అందుతోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
సాగునీటి అవసరాలకు కీలకం
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో తుమ్మిడిహెట్టి బ్యారేజీ కీలకమైనది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రభావం, నీటి తరలింపు వంటి అంశాలపై తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో చర్చలు జరుపుతోంది.బ్యారేజీ ఎత్తుపై ఇరు రాష్ట్రాల మధ్య స్పష్టత వస్తే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన తదుపరి చర్యలకు మార్గం సుగమమయ్యే అవకాశం ఉంది. సమావేశానికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడైతే బ్యారేజీ ఎత్తుపై తుది నిర్ణయంపై స్పష్టత రానుంది.
#ThummidihattiBarrage #RevanthReddy #DevendraFadnavis #TelanganaNews #TelanganaPolitics #IrrigationProjects #PranahitaChevella #BreakingNews #HyderabadNews
