డిండి, అచ్చంపేట ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు..సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ, డిండి, అచ్చంపేట ప్రాజెక్టులపై కీలకంగా చర్చించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో చర్చలకు సీఎం ఆదేశాలు
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 23వ తేదీ తర్వాత చర్చలకు పిలుస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల సానుకూలంగా స్పందించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే ఎంత నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందో, మహారాష్ట్ర పరిధిలో ఎంత మేరకు ముంపు ఏర్పడుతుందో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.అటవీ ప్రాంతం, గిరిజనులు అధికంగా నివసించే వెనుకబడిన ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యానికి అనుగుణంగా బ్యారేజీ ఎత్తు ఉండాలని సీఎం సూచించారు.ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని, 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా అన్ని నివేదికలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశాలకు సంబంధించిన వివరాలను కూడా అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు.
డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీటిని, అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి 0.1 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమైన మొత్తం 0.6 టీఎంసీల నీటిని ఏదుల రిజర్వాయర్‌కు అదనంగా తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందుకోసం శ్రీశైలం, నార్లాపూర్ నుంచి నీటిని తీసుకొచ్చే అవకాశాలను పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఈ ఏర్పాట్లతో పాలమూరు ప్రాంతానికి కేటాయించిన నీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని సీఎం స్పష్టం చేశారు.డిండి, అచ్చంపేట ప్రాజెక్టులకు నీటిని తరలించేందుకు అవసరమైన పంప్‌హౌస్‌లు, పంపులు, ఇతర సాంకేతిక వ్యవస్థల ఏర్పాట్లను వెంటనే చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టుల ప్రతిపాదనలు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, అంతర్రాష్ట్ర చర్చలకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా కసరత్తు చేసి ముందుకు వెళ్లాలని సూచించారు.రాష్ట్రంలోని సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులను వేగవంతం చేయడం, వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు అందించడం, ఇప్పటికే ఉన్న నీటి కేటాయింపులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంపై ఈ సమీక్షలో ప్రధానంగా దృష్టి సారించారు.
#RevanthReddy #Telangana #TummidihattiBarrage #DindiProject #Achampet #IrrigationProjects #BhattiVikramarka #UttamKumarReddy #TelanganaNews #VSRBreakingNew
