*సిరిసిల్లకు తొలిసారి సీఎం రేవంత్..345.78 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

*సిరిసిల్లకు తొలిసారి సీఎం రేవంత్*

*రూ.345.78 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం*

*నేతన్నలు, మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి*

*30న సిరిసిల్లలో ముఖ్యమంత్రి పర్యటన.. భారీ బహిరంగ సభ*

• ముఖ్యమంత్రి హోదాలో ఎ. రేవంత్ రెడ్డి తొలిసారిగా ఈ నెల 30న సిరిసిల్ల పట్టణంలో పర్యటించనున్నారు.

• ప్రతిపక్ష నేతగా మూడుసార్లు సిరిసిల్ల గడ్డపై అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

• ఈ నెల 30న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి రానున్న ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

• సిరిసిల్ల రగుడు బైపాస్ సమీపంలో బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

• ఈ పర్యటనలో రూ.345.78 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేయనున్నారు.

• వస్త్ర ఉత్పత్తి నిలయంగా పేరొందిన సిరిసిల్లలో నేతన్నల సంక్షేమం, అభివృద్ధి, మహిళల సాధికారతతో పాటు విద్య, మౌలిక వసతుల అభివృద్ధి పనులకు సీఎం ఈ సందర్భంగా శ్రీకారం చుట్టనున్నారు. చేనేత, పవర్‌లూమ్ వస్త్ర ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు ఈ నేతన్న బజార్ ఉపయోగపడనుంది. ప్రధానంగా సిరిసిల్లలో సాంచాలపై ఉత్పత్తి చేసే పెట్టికోట్, పాలియెస్టర్ వస్త్రాల మార్కెటింగ్‌కు వీలుగా ఈ నేతన్న బజార్‌ను ఏర్పాటు చేయాలని సీఎం ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

• సిరిసిల్లతో పాటు వేములవాడలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. పెద్దూరులో 18 ఎకరాల్లో ప్రతిపాదించిన ఈ విద్యా సముదాయంలో 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సుమారు 2,600 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా 64 తరగతి గదులు, డార్మిటరీలు, డైనింగ్ బ్లాక్, క్రీడా మైదానాలు తదితర సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.

• సిరిసిల్ల, కోనరావుపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తారు. ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు తరగతి గదులు, ల్యాబ్‌లు, డైనింగ్ హాళ్లు, క్రీడా సదుపాయాలు, ఐటీ మౌలిక వసతులతో వీటిని అభివృద్ధి చేయనున్నారు.

• వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.99.40 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మండపాలు, గోపురాలు, ప్రాకారాలు, సైట్ డెవలప్‌మెంట్, నీటి సరఫరా–మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ పనులు, షాపింగ్ కాంప్లెక్సులు, ఉత్తర వైపు సీసీ రోడ్డు సహా 26 పనులు ఇందులో ఉన్నాయి.

• జిల్లాలో పరిపాలనా మౌలిక వసతుల విస్తరణలో భాగంగా ఏడు కొత్త ప్రభుత్వ కార్యాలయ భవనాలు నిర్మించనున్నారు. సిరిసిల్ల, వేములవాడలో రెండు ఆర్డీవో కార్యాలయాలు, తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్, రుద్రంగిలో నాలుగు తహసీల్దార్ కార్యాలయాలు, వేములవాడలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

• రుద్రంగిలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు, అనుబంధ యూనిట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు ఈ గోదాములు ఉపయోగపడనున్నాయి.

• సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దూరులో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశాలు, శిక్షణ, జీవనోపాధి కార్యక్రమాలతో పాటు మహిళా సంఘాల ఉత్పత్తుల విక్రయానికి ఈ భవనం వేదిక కానుంది.

• సిరిసిల్లలో కొత్త నేతన్న బజార్ ఏర్పాటు కూడా పర్యటనలో కీలక అంశంగా ఉండనుంది. చేనేత, పవర్‌లూమ్ వస్త్ర ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు దీన్ని ప్రతిపాదించారు. దీనికి అవసరమైన మౌలిక వసతులు, ఆర్థిక సహాయం కోసం చేనేత–జౌళి శాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపారు. ఈ పనికి ఇంకా తుది మంజూరు, వ్యయం ఖరారు కాలేదు.

• వేములవాడలో మహిళా పోలీస్ స్టేషన్, వేములవాడ–సిరిసిల్లలో రెండు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn