మెట్రోపై చర్చలు ఫలప్రదం…

మెట్రోపై చర్చలు ఫలప్రదం…
* ఫేజ్-I వాల్యూయేషన్.. ఫేజ్-II విస్తరణకు కన్సల్టెంట్‌గా SBICAPS
* కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ
* సమన్వయ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వ అధికారి… రాష్ట్ర ఎంఏయూడీ స్పెషల్ సెక్రటరీ
* ముఖ్యమంత్రి… కేంద్ర మంత్రుల సంయుక్త సమావేశంలో నిర్ణయం
ఢిల్లీ: హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం..విస్తరణపై కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి… హైదరాబాద్ మెట్రో ఫేజ్-I స్వాధీనం.. ఫేజ్-II విస్తరణపై ఉన్న ఆటంకాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా రెండు రోజులు సమావేశమయ్యారు. తొలుత సోమవారం రాత్రి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి ఖట్టర్ నివాసంలో ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్బంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్- I వాల్యూయేషన్… ఫేజ్-I స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ.. రుణ సంస్థ ఎంపిక… మెట్రో ఫేజ్-II విస్తరణ.. నిర్మాణ వ్యయం… అందుకు అవసరమైన రుణ సేకరణ అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ ను నియమించాలని కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి ఏకాభిప్రాయానికి వచ్చారు. కన్సల్టెంట్‌గా SBICAPSని ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్-I వాల్యూయేషన్… ఫేజ్-II విస్తరణ…ఇతర అంశాలపై SBICAPS సమగ్రంగా అధ్యయనం చేయనుంది. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నారు. కన్సల్టెంట్ అధ్యయనం సమయంలో సమన్వయానికి ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి (MA &UD) శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ అధికారులు ఇద్దరు సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ వేగంగా సాగేందుకు కృషి చేస్తారు.
