గ్రామపంచాయతీల సొంత ఆదాయం ఇక నేరుగా గ్రామపంచాయతీ ఖాతాల్లోనే…

గ్రామపంచాయతీల సొంత ఆదాయం ఇక నేరుగా గ్రామపంచాయతీ ఖాతాల్లోనే
చట్ట సవరణ అమలుకు ఉత్తర్వులు జారీ.. గ్రామాల అభివృద్ధి మరింత వేగవంతం
ఉత్తర్వులు వెలువడటం పట్ల మంత్రి సీతక్క హర్షం
పల్లెల ఆర్థిక స్వావలంబనకు కీలక ముందడుగు – మంత్రి సీతక్క
హైదరాబాద్, నవంబర్ 6: గ్రామపంచాయతీలు తమ సొంత వనరుల ద్వారా సమకూర్చుకునే ఆదాయం ఇకపై ట్రెజరీలో జమ కాకుండా నేరుగా గ్రామపంచాయతీల సొంత ఖాతాల్లోనే జమ అయ్యేలా చేసిన చట్ట సవరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ (నాలుగో సవరణ) చట్టం–2026ను అక్టోబర్ 9, 2026 నుంచి అమల్లోకి తీసుకొస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీవో నంబర్ 43ను శుక్రవారం నాడు జారీ చేసింది.
గతంలో గ్రామపంచాయతీలు సమకూర్చుకున్న సొంత ఆదాయం ట్రెజరీ ద్వారా ఖర్చు చేయాల్సి రావడంతో గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులకు నిధులు అందుబాటులోకి రావడంలో జాప్యం జరిగేది. అత్యవసర పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిలైట్లు, రహదారులు, ఇతర స్థానిక అవసరాల కోసం గ్రామపంచాయతీలు నిధుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది.
గ్రామాల అవసరాలకు అనుగుణంగా సొంత ఆదాయాన్ని వేగంగా వినియోగించుకునేలా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. మంత్రి సీతక్క చొరవతో గ్రామపంచాయతీలకు ఆర్థిక స్వావలంబన పెంచే దిశగా తీసుకున్న ఈ నిర్ణయానికి ఇప్పుడు అమలు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
గ్రామపంచాయతీల సొంత ఆదాయం నేరుగా వాటి ఖాతాల్లోనే జమ కావడంతో స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులను వేగంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడనుంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది.
గ్రామాల అభివృద్ధికి గ్రామపంచాయతీలే మరింత బాధ్యతతో నిర్ణయాలు తీసుకునేలా, స్థానిక సంస్థలకు ఆర్థిక స్వేచ్ఛను పెంచే దిశగా ఈ చట్ట సవరణ కీలక అడుగుగా ప్రభుత్వం పేర్కొంది.చట్ట సవరణ ఉత్తర్వులు వెలువడటం పట్ల మంత్రి సీతక్క హర్షం చేశారు. పల్లెల ఆర్థిక స్వావలంబనకు కీలక ముందడుగు అని వ్యాఖ్యానించారు.
#GramPanchayat #PanchayatFunds #TelanganaGovernment #PanchayatRaj #VillageDevelopment #CMRevanthReddy #TelanganaNews #VSRBreakingNews
