విద్యార్థుల యూనిఫాంల రంగు, డిజైన్లపై ప్రత్యేక దృష్టి..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

*విద్యార్థుల అభిప్రాయాలు సేకరించండి*
* యూనిఫాంల రంగు, డిజైన్లపై ప్రత్యేక దృష్టి
* యూనిఫాం.. కిట్ల పంపిణీకి ఎస్వోపీ రూపొందించండి
* ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్: విద్యార్థులకు అందించిన యూనిఫాంలపై వారినుంచి అభిప్రాయాలు (ఫీడ్ బ్యాక్) సేకరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల పరిధిలోని ప్రభుత్వ వసతిగృహాలు, రెసిడెన్షియల్స్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు, కిట్ల పంపిణీపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
గతంతో పోలిస్తే ఎంతో నాణ్యమైన యూనిఫాంలు, ఆకర్షనీయమైన రంగులు, డిజైన్లతో అందజేశామన్నారు. అయితే, ఆయా రంగులు, డిజైన్లకు సంబంధించి విద్యార్థుల నుంచి అభిప్రాయాలు (ఫీడ్బ్యాక్) సేకరించాలన్నారు. అలా చేస్తే ఎక్కువ మంది విద్యార్థులు కోరుకునే రంగులు, డిజైన్లకు భవిష్యత్లో ప్రాధాన్యమివ్వచ్చని అన్నారు. యూనిఫాంలతో పాటు టైలు, బెల్టులు, ఐడీ కార్డులు, షూలు, సాక్సులు, ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, కార్పెట్లు, స్కూల్ బ్యాగుల పంపిణీ దాదాపు పూర్తయిందని అధికారులు సీఎంకు తెలియజేశారు. ఒకట్రెండు సంస్థల పరిధిలో కొన్ని వస్తువుల పంపిణీ 95 శాతం వరకు పూర్తయిందని చెప్పారు. ఆ వస్తువుల పంపిణీని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
వచ్చే ఏడాదికి విద్యార్థులకు అందజేసే యూనిఫాంలు, ఇతర సామగ్రికి సంబంధించి విధి విధానాలను (ఎస్వోపీ) రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థులకు అందజేసే వస్తువుల జాబితా రూపకల్పన, టెండర్లు , సరఫరా, అందజేత వరకు ప్రతిదీ నిర్దేశిత సమయంలో పూర్తవ్వాలని తెలిపారు. పాఠశాలలు తెరిచిన రోజునే మొత్తం వస్తువులు అందేలా ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
#RevanthReddy #Telangana #TelanganaNews #StudentUniforms #SchoolUniforms #EducationDepartment #CMRevanthReddy #VSRBreakingNews
