రూ.50 వేల కోట్ల భూములపై సుప్రీంకోర్టు తీర్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: మియాపూర్‌లో సుమారు రూ.50 వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వానికి చెందుతాయని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం న్యాయపోరాటం చేసిందని, ఈ విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.మియాపూర్ భూములను ఆక్రమించుకునేందుకు గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన బంధువు దామోదర్ రావు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ద్వారా ప్రయత్నాలు జరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దామోదర్ రావుకు విలాసవంతమైన కార్లను లంచంగా ఇచ్చారని, కేసీఆర్‌కు నగదు రూపంలో ముడుపులు అందాయని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు.ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భూకబ్జాల వ్యవహారాలపై పోరాడినందుకే తనపై కక్షగట్టి జైలుకు పంపారని సీఎం వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు.
రూ.1.50 లక్షల కోట్ల విలువైన భూములు కాపాడాం
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడేళ్లలో సుమారు రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఐఎంజీ భూముల వ్యవహారంలో కేటీఆర్, భలేరావు కుటుంబ సభ్యులతో కుమ్మక్కై భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కంచె గచ్చిబౌలి, మామిడిపల్లి భూముల విషయంలోనూ న్యాయపోరాటం చేసి ప్రభుత్వ ఆస్తులను రక్షించామని చెప్పారు.గుర్రంగూడలోని అటవీ భూములను కేటీఆర్ అనుచరులు ఆక్రమించేందుకు ప్రయత్నించారని, ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టులో పోరాడి అవి అటవీ భూములేనని నిర్ధారించేలా చర్యలు తీసుకున్నామని సీఎం వివరించారు. మంచిరేవులలో 143 ఎకరాల భూమిని రాయలసీమ బిల్డర్స్‌తో కలిసి ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఆ భూములను రక్షించి, అందులో పోలీసుల పిల్లల కోసం పాఠశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 400 ఎకరాల అటవీ భూమిని బీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేకు నజరానాగా అప్పగించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పోరాడి భూములను కాపాడామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ బీఆర్ఎస్ నాయకుల భూ ఆక్రమణలను అడ్డుకున్నామని వెల్లడించారు.
భూముల విక్రయంపై కేబినెట్లో చర్చ
మియాపూర్ భూములను విక్రయించడం ద్వారా వచ్చే నిధులను నీటిపారుదల, విద్య, వైద్యం తదితర కీలక రంగాల అభివృద్ధికి వినియోగిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యంగా విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ నిధులను ఉపయోగిస్తామని తెలిపారు. భూముల విక్రయం, వాటి ద్వారా వచ్చే ఆదాయంతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై వనరుల సమీకరణ కోసం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుందని చెప్పారు. ఈ అంశాన్ని కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
భూ ఆక్రమణలపై అసెంబ్లీలో చర్చకు రావాలి
హరీష్ రావు మామ హనుమంతరావుకు సంబంధించిన భూముల సర్వేకు అధికారులు వెళ్తే వారిని అడ్డుకుంటున్నారని, కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారని సీఎం ఆరోపించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై బీఆర్ఎస్ నాయకులు తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ఈ అంశాలపై చర్చకు వచ్చినప్పుడు మాత్రం వెనక్కి తగ్గుతున్నారని వ్యాఖ్యానించారు.మియాపూర్ భూములపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కనీసం ప్రభుత్వానికి, రెవెన్యూ అధికారులకు అభినందనలు కూడా తెలియజేయడం లేదని అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పద్మాలయ స్టూడియో, ల్యాంకో భూముల వ్యవహారాలపై కేసులు వేసిన కేసీఆర్, హరీష్ రావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో కేసులు వేసిన వారితోనే రాజీపడ్డారని ఆరోపించారు.మియాపూర్ భూముల విషయంలో ఇప్పటికైనా కుట్రలు మానుకోవాలని కేసీఆర్, కేటీఆర్‌లకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. భూముల ఆక్రమణలపై చర్చించేందుకు బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు.సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మియాపూర్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, వాటికి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
#RevanthReddy #MiyapurLandCase #SupremeCourt #TelanganaNews #KCR #KTR #BRS #TelanganaPolitics #HyderabadNews #GovernmentLands #VSRBreakingNews
