సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డి.. డేట్ ఫిక్స్

చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధిపేటకు వెళ్తున్నారు. హరీష్ రావు నియోజకవర్గంలో నవంబర్ 19న సిద్ధిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు.సిద్ధిపేట వేదికగా ఇందిరమ్మ చీరల పంపిణీ జరగనుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నారు.సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్‌లో భారీ సభలు నిర్వహించి కేసీఆర్ కుటుంబాన్ని నిలదీస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే సిరిసిల్లలో పాదయాత్ర నిర్వహించి, భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.ఇప్పుడు నవంబర్ 19న సిద్ధిపేటకు వెళ్లనున్నారు. సిద్ధిపేట సభలో హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరగబోతున్నారు.
*రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు (05.11.26)*
1. దీపావళి సందర్భంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2,25,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. నిర్మాణం పూర్తయిన అన్ని ఇళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
2. నవంబర్ 7 నుంచి 9 వరకు కొడంగల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. నవంబర్ 9న కొడంగల్‌లో భారీ రైతు బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభలో ముఖ్యమంత్రి, మంత్రులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొంటారు.
3. నవంబర్ 19న మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. అదే రోజు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభిస్తాం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తాం.
నవంబర్ 20 నుంచి 30 వరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తులు సేకరిస్తాయి. తహశీల్దార్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు వాటిని స్వీకరిస్తారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా వర్తిస్తుంది.
4. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాక్ట్, 2003ను రద్దు చేసేందుకు ఆమోదం తెలిపింది. ప్రతి కమిషన్‌లో ఒక చైర్మన్, ఐదుగురు సభ్యులు ఉంటారు. ఎస్సీ, ఎస్టీల నుంచి వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది.
5. తెలంగాణ ఫైర్ సర్వీస్ యాక్ట్, 1999 సవరణకు సంబంధించిన ఆర్డినెన్స్ జారీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం, ప్రమాదాలకు కారణాలను గుర్తించడం, వేగంగా స్పందించడం వంటి అంశాలు ఇందులో ఉంటాయి. ఇళ్లు, అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక శాఖ చేపట్టాల్సిన చర్యలను ఇందులో పొందుపరుస్తారు.
6. తెలంగాణ సర్వే మరియు సరిహద్దుల చట్టం, 1923లోని సెక్షన్ 12(ఏ) సవరణ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సర్వే, సరిహద్దులకు సంబంధించి జారీ చేసే నోటీసులపై అప్పీల్ చేసుకునే కాలపరిమితిని 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
7. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో కొత్తగా ఏర్పాటైన జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి కోర్టు కోసం 56 పోస్టుల మంజూరుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని నాలుగు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో వివిధ విభాగాలకు మరో 80 పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది. మొత్తం 136 పోస్టుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
#CMRevanthReddy #Siddipet #RevanthReddy #HarishRao #IndirammaSarees #IndirammaFamilyInsurance #TelanganaPolitics #TelanganaNews #Congress #VSRBreakingNews
