క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌రేట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

కరీంనగర్ | VSR BREAKING NEWS

కరీంనగర్: నూతన కలెక్టరేట్ భవనం పేదలకు నమ్మకాన్ని కల్పించేలా ఉండాలని, వారి సమస్యలను పరిష్కరించే కేంద్రంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కరీంనగర్ నూతన కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ప్రజలకు సంక్షేమ పథకాలను చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు.సహాయం కోసం నిస్సహాయ స్థితిలో కార్యాలయాలకు వచ్చే ప్రజల్లో తమ కుటుంబ సభ్యులను చూసుకోవాలని అధికారులకు సూచించారు. అలా ఆలోచించినప్పుడే సహాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ నూటికి నూరు శాతం న్యాయం చేయగలమని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, వారి సమస్యలను పరిష్కరించినప్పుడే ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడుతుందని తెలిపారు.చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న నూతన కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని పూర్తి చేశామని, ప్రజలకు సేవలు అందించే ఉద్యోగులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ భవన సముదాయాన్ని నిర్మించినట్లు సీఎం వెల్లడించారు.

 

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యోగుల సహకారంతోనే వీలైనంత మేరకు వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రజలకు సేవలు అందిస్తూనే ఉద్యోగులు తమ సమస్యలను కూడా పరిష్కరించుకోవాలని సూచించారు.ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఉద్యోగుల సహకారం ఎంతో అవసరమని, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా ప్రజలకు అందించే సేవల ద్వారానే గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఉద్యోగులంతా అంకితభావంతో పనిచేస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.

కేంద్రంతో సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి

రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు సాగుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టులు నిర్మించినా, కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు రాకపోతే వాటి వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.కొందరు తమ ఢిల్లీ పర్యటనలపై విమర్శలు చేస్తున్నారని, అయితే రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లైనా కేంద్ర ప్రభుత్వాన్ని కలవాల్సిందేనని స్పష్టం చేశారు. సిద్ధాంతాలు వేరైనా రాష్ట్ర అభివృద్ధి విషయంలో పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఆరు నెలల్లోనే 170 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర అభివృద్ధి కోసం బదలాయించేలా అనుమతులు సాధించామని సీఎం తెలిపారు. బేగంపేట రన్‌వే కింద నుంచి రోడ్డు నిర్మించుకునేందుకు కూడా అనుమతులు తీసుకొచ్చామని వెల్లడించారు.

జిల్లా అభివృద్ధిపై మరోసారి సమీక్ష

కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడంతో పాటు, అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా అభివృద్ధిపై మరోసారి పూర్తిస్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తానని సీఎం వెల్లడించారు.

#CMRevanthReddy #RevanthReddy #Karimnagar #KarimnagarCollectorate #TelanganaGovernment #TelanganaNews #RevanthReddySpeech #TelanganaPolitics #GovernmentEmployees #KarimnagarNews #VSRBreakingNews

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn