బీఆర్ఎస్ ఎపి అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్
1 min read
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ విస్తరణపైన కేసీఆర్ ద్రుష్టి సారించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రైతు విభాగాలను ఏర్పాటు చేసిన ఆయన ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టడానికి రెఢీ అయ్యారు. ఇందులో భాగంగా పలువురు ఆంధ్రా నాయకులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు.ప్రజారాజ్యం, జనసేన పార్టీల్లో కీలకంగా వ్యవహారించిన మాజీ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఎపి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఆయన గతంలో గుంటూరు నుంచి ఎంపిగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ నుంచి ఏలూరులో, గుంటూరు వెస్ట్ నుంచి జనసేన తరుపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. బలమైన కాపు సామాజికవర్గం నేత కావడంతో తోట చంద్రశేఖర్ వైపు కేసీఆర్ మొగ్గు చూపించినట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా గులాబీ కండువా కప్పుకుంటున్నారు. ఆయన గతంలో చంద్రబాబునాయుడు క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో టీడీపీ ఆయనకు టిక్కెట్ నిరాకరించింది. ఆ తర్వాత జనసేన, బీజేపీల్లో పనిచేశారు. 2019లో అనకాపల్లి లో జనసేన ఎంపి అభ్యర్థిగా పోటీ చేసిన చింతల పార్థసారథి కూడా కేసీఆర్ గూటికి చేరుతున్నారు. మరో నేత టీజే ప్రకాష్ కూడా బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు. వీరితో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు నాయకులు కూడా కేసీఆర్ కి జై కొట్టనున్నారు.