ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఫ్యూచర్ సిటీకి ఆహ్వానం

హైదరాబాద్: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ వారసత్వ సంపద పరిరక్షణ, మూసీ నది పునరుజ్జీవం, హైదరాబాద్ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

అగా ఖాన్ ఫౌండేషన్‌పై సీఎం ప్రశంసలు

అగా ఖాన్ ఫౌండేషన్‌పై తనకు అత్యంత గౌరవం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగా ఖాన్ ఫౌండేషన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

అగా ఖాన్ ఫౌండేషన్ సహకారంతో ఇటీవలే శాసనమండలి భవనాన్ని పునరుద్ధరించుకున్నామని సీఎం తెలిపారు. కుతుబ్ షాహీ టూంబ్స్‌ను కూడా అగా ఖాన్ ఫౌండేషన్ పునరుద్ధరించిందని పేర్కొన్నారు.

మూసీ పునరుజ్జీవానికి అగా ఖాన్ ఫౌండేషన్ సహకారం

మూసీ నది పునరుజ్జీవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో అగా ఖాన్ ఫౌండేషన్ సహకారాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్‌లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని సీఎం చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వారసత్వ సంపదగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

మూసీ నదిని నైట్ ఎకానమీకి అనుగుణంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

 

 

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు అగా ఖాన్‌కు ఆహ్వానం

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ సదస్సుకు 100కు పైగా దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారని వెల్లడించారు.

గ్లోబల్ సమ్మిట్‌కు తప్పక హాజరు కావాలని ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

2047 నాటికి తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే లక్ష్యం

2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

 

30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, దీనిని నెట్-జీరో సిటీగా అభివృద్ధి చేయబోతున్నామని చెప్పారు. ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాల దూరంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు.

సింగపూర్‌కు చెందిన కంపెనీ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తోందని సీఎం వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వంటి సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

 

 

#RevanthReddy #AgaKhan #AgaKhanFoundation #FutureCity #TelanganaGlobalSummit #Hyderabad #TelanganaNews #MusiRiver #OsmaniaHospital #TajFalaknumaPalace

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn