దళిత స్పీకర్‌ను అవమానించారు.. కేటీఆర్ పీఏ, పీఆర్వోల ప్రవర్తన దారుణం

హైదరాబాద్: ప్రజా సమస్యలపై చర్చించేందుకే ప్రజా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసిందని ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ అన్నారు. సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తనను ప్రజలంతా చూశారని పేర్కొన్నారు.

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో సమావేశం ఏర్పాటు చేసుకుని వచ్చిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మహిళా పోలీసు అధికారులపై నీచాతినీచంగా వ్యవహరించారని బల్మూర్ వెంకట్ ఆరోపించారు. దళిత స్పీకర్‌ను అవమానించారని, దీనిపై సభలో క్షమాపణ చెప్పాలని కోరినా పట్టించుకోలేదన్నారు.

దళిత సంఘాలు కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద డప్పు దండోరా మోగిస్తే పసుపు నీళ్లతో శుద్ధి చేసి దళితులను అవమానించారని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్ దళిత వ్యతిరేక పార్టీగా మారిందని విమర్శించారు.

కేటీఆర్ పీఏ, పీఆర్వోలపై ఆరోపణలు

అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్ పీఏ, పీఆర్వోల ప్రవర్తన అత్యంత దారుణంగా ఉందని బల్మూర్ వెంకట్ అన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌పై ఉపయోగించిన భాషలోనే కేటీఆర్ పీఏ, పీఆర్వోలు కూడా మాట్లాడారని ఆరోపించారు.

ఇంకా తామే అధికారంలో ఉన్నామన్నట్లుగా, కేటీఆర్ రాష్ట్రానికి యువరాజు అన్నట్లుగా వారి తీరు ఉందని విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడటం చేతకాకే బీఆర్‌ఎస్ నేతలు వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు.

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఘటనపై

సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో దాడి జరిగిందంటూ కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడుతున్నారని బల్మూర్ వెంకట్ అన్నారు. అయితే కేటీఆర్ పీఏ, పీఆర్వోలపై ఎలాంటి దాడి జరగలేదని పోలీసు ఉన్నతాధికారులు తేల్చి చెప్పారని పేర్కొన్నారు.

గణేష్ మండపానికి డీజే అనుమతి కోసం కొందరు యువకులు పోలీస్ స్టేషన్‌కు వచ్చారని తెలిపారు. కేటీఆర్ పీఆర్వో పోలీసులపై చెప్పరాని భాషలో దూషణలు చేశారని ఆరోపించారు.

“మీడియాలో కనిపించాలన్న ఆరాటంతోనే హడావుడి”

మీడియాలో కనిపించాలన్న ఆరాటంతోనే బీఆర్‌ఎస్ నేతలు హడావుడి చేస్తున్నారని బల్మూర్ వెంకట్ విమర్శించారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పోలీసులు తమ విధులను నిర్వర్తిస్తున్నారని తెలిపారు.

పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ఇలాంటి భాషను, ఇలాంటి ప్రవర్తనను ఎన్నడూ ప్రదర్శించలేదని అన్నారు.

“కేటీఆర్ ప్రవర్తన మార్చుకోవాలి”

కేటీఆర్ ఇప్పటికైనా తన ప్రవర్తన మార్చుకోవాలని బల్మూర్ వెంకట్ సూచించారు. కేటీఆర్ కంటే ఎక్కువగా తిట్లు తిట్టగలమని, కానీ తమ తల్లిదండ్రులు తమకు విజ్ఞత నేర్పించారని వ్యాఖ్యానించారు.

కేటీఆర్ వ్యవహారశైలిపై దళితులు త్వరలోనే తిరగబడతారని అన్నారు. దళితుల పట్ల దొర అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ ప్రవర్తనను చూసి సిగ్గు అనిపిస్తోందన్నారు.

ఒక కులానికి మచ్చ తెచ్చే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని, ఆయన చేసిన తప్పుకు ఆ కులం మొత్తం తలదించుకునే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజానికి, దళితులకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కేటీఆర్ పీఏ, పీఆర్వోలు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని, లేదంటే పోలీసులు తమ పని తాము చేసుకుంటూ పోతారని హెచ్చరించారు.

శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బల్మూర్ వెంకట్ కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన పక్కటెముకలు విరిగిపోయినా ఏనాడూ పోలీసులను దూషించలేదని ఆయన తెలిపారు.

 

Hashtags #BalmurVenkat #KTR #BRS #TelanganaPolitics #TelanganaAssembly #TelanganaNews #BRSvsCongress #HarishRao #ThataMadhu #DalitIssues #SaifabadPolice #CongressGovernment #HyderabadNews #VSRBreakingNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn