శరవేగంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు

*శరవేగంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు*
* 105 నియోజకవర్గాల్లో ఆధునిక విద్యా ప్రాంగణాలు
* వివిధ దశల్లో 86 పాఠశాలలు
* ఇప్పటికే రూ.1,144.85 కోట్ల నిధుల విడుదల
హైదరాబాద్:
కులమతాలకతీతంగా విద్యార్థులందరికీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల (YIIRS) నిర్మాణం శరవేగంగా సాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు వేర్వురుగా వసతిగృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండేవి. ఇవి విద్యార్థుల మనుస్సుల్లో చిన్నతనం నుంచే తామంతే వేర్వరనే భావన కల్పించేవి. ఈ హద్దులను చెరిపివేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులందరినీ ఒకే చోట చేర్చి వారికి నాణ్యమైన విద్యను అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ పాఠశాలలకు రూపకల్పన చేశారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బాలురు, బాలికలకు ఒక్కోటి చొప్పున ఈ స్కూళ్లను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. మొదటి విడతగా 105 నియోజకవర్గాల్లో ఒక్కో స్కూల్ చొప్పున నిర్మించనున్నారు. ఇందులో ఇప్పటికే 86 స్కూళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉండగా, 19 పాఠశాలలకు పరిపాలన పరమైన అనుమతుల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
ప్రభుత్వం తొలి దశల్లో 86 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. వీటిలో 78 పాఠశాలల నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. వీటి పనులు జోరుగా సాగుతున్నాయి. ఆదిలాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయి, పనుల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ముధోల్, బోథ్, నిర్మల్ నియోజకవర్గాల్లో టెండర్ల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. సిర్పూర్, కామారెడ్డి, దుబ్బాక నియోజకవర్గాల్లో పాఠశాలల నిర్మాణానికి అవసరమైన స్థలాలను ఇటీవలే కేటాయించగా, ప్రస్తుతం వాటికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు) సిద్ధమవుతున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పాఠశాల నిర్మాణానికి స్థలాన్ని గుర్తించగా, చాంద్రాయణగుట్టలో స్థల ఖరారు ప్రక్రియ కొనసాగుతోంది.
* అత్యాధునిక ప్రమాణాలు..
గ్రామీణ ప్రాంతాలతో పాటు వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు కూడా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల మేరకు విద్యను అందించేలా ఈ పాఠశాలలకు రూపకల్పన చేశారు. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన–అభ్యసన సౌకర్యాలు, అత్యాధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, విశాలమైన డార్మెటరీలు, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన క్రీడా మైదానాలు, డైనింగ్ బ్లాక్‌లు, బోధన, బోధనేతర సిబ్బందికి నివాస గృహాలతో సుమారు 25 నుంచి 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ విద్యా ప్రాంగణాలు రూపుదిద్దుకుంటున్నాయి.
* పారదర్శకంగా అంచనాలు…
ఇంజినీరింగ్ డిజైన్లు, ప్రస్తుత షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ను ఆధారంగా చేసుకుని నిర్మాణ వ్యయ అంచనాలను పారదర్శకంగా రూపొందించారు. ఫలితంగా గతంలో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల కంటే తక్కువ నిర్మాణ వ్యయంతోనే అత్యాధునిక వసతులతో ఈ స్కూళ్ల నిర్మాణం సాధ్యమవుతోంది. ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌లో సుమారు 2,650 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా రూపకల్పన చేశారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం సుమారు 5.36 లక్షల చదరపు అడుగులు ఉండేలా ప్రణాళిక రూపొందించారు.
* భారీగా నిధుల విడుదల
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,144.85 కోట్ల నిధులు విడుదల చేసింది. నిధులు అందుబాటులో ఉండటంతో అనేక నియోజకవర్గాల్లో నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఫౌండేషన్ పనులు పూర్తవగా, మరికొన్ని చోట్ల భవన నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి.
* పరిపాలన అనుమతులకు మరో 19 పాఠశాలలు
మొత్తం 105 నియోజకవర్గాల్లో ఇప్పటికే 86 పాఠశాలల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతుండగా, మిగిలిన 19 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రక్రియ కూడా వేగంగా ముందుకు సాగుతోంది. కోరుట్ల, జనగామ, హుజురాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, అలంపూర్, సిద్దిపేట, నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్, ఎల్.బి.నగర్, మహేశ్వరం, సూర్యాపేట, ఉప్పల్, బాల్కొండ, నిజామాబాద్, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేసి, పరిపాలన అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. ఈ అనుమతులు లభించిన వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
* విద్యా రంగంలో మైలురాయి..
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తోంది. పరిపాలన అనుమతులు, టెండర్లు, నిధుల విడుదల, నిర్మాణాల పురోగతి అన్నీ సమాంతరంగా సాగుతుండటంతో రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆధునిక విద్యా ప్రాంగణాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
