తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి- నాకు ఎవరూ పోటీ కాదు సీఎం రేవంత్

తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి- నాకు ఎవరూ పోటీ కాదు* – అని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పదిన్నరేళ్ల పాటు తెలంగాణకు తానే సీఎం అని ఆయన స్పష్టం చేశారు. 2029 లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వ పదవి కాలం మరో ఆరునెలలు పెరుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు.ఫోన్ ట్యాపింగ్ కేసు తుది అంకానికి చేరిందని ఆయన అన్నారు. అన్ని కేసుల్లో దర్యాప్తు ఆధారంగానే ముందుకెళ్తామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పై కక్ష సాధింపులేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కేసీఆర్ ని జైలులో వేయాలనుకుంటే నిబంధనల ప్రకారమే వెళ్తామన్నారు. ఎవరి ఫోన్లూ ట్యాప్ చేయడం లేదన్న ఆయన ట్యాపింగ్ చేసి సంభాషణలు వింటే ఆయష్షు తగ్గుతుందని వ్యాఖ్యానించారు. ట్యాపింగ్ కాల్స్ వినడం ఓ మానసిక రోగమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం అధ్యయనం చేస్తున్నామని, ఇందు కోసం నిపుణుల కమిటీకి అప్పగించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.-మూడు గేట్ల మరమ్మతుల తర్వాత ప్రాజెక్ట్ కూలితే ఆ నింద మాపై వేయాలని బీఆర్ఎస్ చూస్తోందని విమర్శించారు. కేసీఆర్, హరీష్ రావు కోరినట్టు ప్రభుత్వం నడవదని రేవంత్ తేల్చి చెప్పారు. కాళేశ్వరం, ఫార్ములా రేస్ పై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎం ప్రశ్నించారు. సోనియా, రాహుల్ ను విచారించిన ఈడీ- కేటీఆర్ ను ఎందుకు విచారించలేదని ఆయన ప్రశ్నించారు.
సింగరేణి టెండర్లపై అసెంబ్లీలో చర్చ పెట్టి అన్ని డాక్యుమెంట్లను సభ ముందు ఉంచుతామని సీఎం తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాం నుంచే సింగరేణికి బకాయిలున్నని చెప్పారు. పాలమూరు- రంగారెడ్డి 33శాతం పూర్తయిందని ,ఇంకా 66 శాతం పనులు చేయాల్సిందన్నారు.
గోదావరిపై మా ప్రాజెక్టులను ఏపీ అడ్డుకుంటోంది, కేసులు వేసి ఎన్ వోసీ రాకుండా చేస్తున్నారని సీఎం విమర్శించారు. అందుకే పోలవరం నల్లమలసాగర్ ను అడ్డుకుంటున్నామని ఆయన తేల్చి చెప్పారు. దిగువ రాష్ట్రానికి వరద జలాలు ఇవ్వాలని ఎక్కడా లేదని, ఏపీ తమకు నచ్చింది చేస్తామంటే కుదరదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఎన్టీ రామారావు కి భారత రత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎన్టీఆర్ జాతీయ సొత్తు, భారతరత్నకు అర్హుడని ఆయన తేల్చి చెప్పారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం , నా అభిప్రాయాన్ని పార్టీకి కూడా చెబుతానన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ గౌరవిస్తుందన్నారు. జూబ్లీహిల్స్ లో ఎన్టీఅర్ విగ్రహం పెడతామని రేవంత్ రెడ్డి తేల్చారు. తానే ఎన్టీ ఆర్ విగ్రహాన్ని ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.
