*దేశానికి ఆదర్శం మన మహిళలు*సీఎం రేవంత్ రెడ్డి

*దేశానికి ఆదర్శం మన మహిళలు*

ఒకేరోజు 8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాల నిర్మాణం

త్వరలోనే ఇందిరా మహిళా శక్తి కార్పొరేట్ సూపర్ బజార్లు, లాజిస్టిక్ హబ్లు, గోదాములు, రైస్ మిల్లులు

*సచివాలయం నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి*

2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ‘మహిళలు ఆర్థికంగా నిలబడితే కుటుంబం నిలబడుతుంది, కుటుంబం నిలబడితే గ్రామం బలపడుతుంది, గ్రామం బలపడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది.. ’ అన్నారు. మహిళా సంఘాలకు బ్యాంక్‌ లింకేజీ రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఇప్పటివరకు ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాలకు రూ.60,472 కోట్ల బ్యాంక్‌ లింకేజీ రుణాలు అందించిందని, వడ్డీ లేని రుణాలకు ఇప్పటికే రూ.1,390 కోట్లను చెల్లించిందన్నారు. మహిళా సంఘాలు ఇకపై చిన్నచిన్న ఉపాధి కార్యక్రమాలకే పరిమితం కాకుండా పెద్ద వ్యాపారాల్లోకి రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రైస్‌ మిల్లులు, మండల స్థాయిలో గోదాములు, లాజిస్టిక్‌ పార్కులు నిర్మించుకోవాలని సూచించారు. వాటికి అవసరమైన చోట భూములను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అవసరమైతే 100 ఎకరాల వరకు భూములు ఇవ్వడానికి సిద్ధమని అన్నారు.

ధాన్యం కొనుగోలు, నిల్వ, మిల్లింగ్‌ వ్యవస్థలో మహిళా సంఘాల పాత్ర పెరగాలని సీఎం అన్నారు. సంఘాలే వడ్లు కొనుగోలు చేసి, బియ్యం ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆడబిడ్డలు ప్రతి గింజకు జవాబుదారులుగా ఉంటారని, వారి చేతుల్లోకి ఈ వ్యవస్థ వెళ్తే పారదర్శకత, బాధ్యత మరింత పెరుగుతుందన్నారు.

మహిళా సంఘాల ఆధ్వర్యంలో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్‌ బజార్లు నెలకొల్పాలని ముఖ్యమంత్రి సూచించారు. డీమార్ట్‌, బిగ్‌బజార్‌లకు పోటీగా ఉండేలా అద్భుతమైన మహిళా శక్తి సూపర్‌ బజార్లు ఏర్పాటు చేయాలని అన్నారు. పట్టణాల్లో సూపర్‌ బజార్ల ఏర్పాటుకు తక్కువ ధరకు స్థలాలను లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. నాణ్యమైన వస్తువులు ప్రజలకు అందుబాటులోకి రావాలి, రైతుల ఉత్పత్తులకు మార్కెట్‌ దొరకాలి, మహిళా సంఘాలకు ఆదాయం రావాలి అన్నదే ఈ ఆలోచన వెనుక ఉన్న లక్ష్యమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళా శక్తి సూపర్‌ బజార్లలో వాటాదారుగా ఉంటుందని, రైతులు పండించే మంచి పంటలు, ఆర్గానిక్‌ ఉత్పత్తులు, నిత్యావసర సరుకులు వీటి ద్వారా వినియోగదారులకు చేరేలా చూడాలని అన్నారు. గ్రామీణ ఉత్పత్తులకు మంచి మార్కెట్‌ లభిస్తే రైతులకు మేలు జరుగుతుందని, వినియోగదారునికీ నాణ్యమైన వస్తువు, మహిళా సంఘాలకూ ఆదాయం లభిస్తుందని చెప్పారు.

సోమవారం సచివాలయం వేదికగా రాష్ట్రంలో నిర్మిస్తున్న 8 వేల ఇందిరా గాంధీ స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. మహిళలను ఆర్థికంగా నిలబెట్టే దిశగా ఇది చారిత్రక కార్యక్రమమని సీఎం అన్నారు. అదే వేదికపై చిలకపచ్చ రంగులో ఉన్న ఇందిరమ్మ చీరల నాలుగు కొత్త డిజైన్లను కూడా సీఎం ఆవిష్కరించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్య సభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణు గోపాల్, మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎంఎల్ ఏలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఆయా విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఒకే రోజు, ఒకే సమయంలో 8 వేల భవనాలకు శంకుస్థాపన చేయడం దేశంలోనే సంచలన నిర్ణయమని సీఎం అన్నారు. మహిళా సంఘాలకు సొంత భవనాలు ఉండటం అంటే కేవలం సమావేశాల స్థలం ఇవ్వటం కాదని, వారి ఆర్థిక కార్యకలాపాలకు, శిక్షణకు, వ్యాపార ప్రణాళికలకు శాశ్వత వేదికను నిర్మించడమని చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం మహిళా శక్తిని దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోందని అన్నారు.

మహిళా అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధికి మార్గమని భావించి ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. తమ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఈ పథకంలో ఆర్టీసీకి రూ.10 వేల కోట్ల వరకు చెల్లించిందని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవసరం లేదని కొందరు రెచ్చగొట్టారని, ఈ పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేశారని విమర్శించారు. మహిళల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని, ఆ కుట్రలను తిప్పికొట్టి ఉచిత ప్రయాణాన్ని కొనసాగించిందని అన్నారు.

మహిళలను బస్సులను యజమానులుగా మార్చాలన్న ఆలోచనతో మహిళా సంఘాల ద్వారా 1000 బస్సులు కొనుగోలు చేయించి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే ప్రణాళికను అమలు చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా జూన్‌ 5న పరేడ్‌ గ్రౌండ్‌లో 553 బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
సోలార్‌ ఎనర్జీ అనగానే అదానీ, అంబానీ వంటి పెద్ద సంస్థలే గుర్తుకు వచ్చే పరిస్థితి మారిపోతుందని, రాష్ట్ర ప్రభుత్వం 1000 మెగావాట్ల సోలార్‌ ఎనర్జీ ప్లాంట్లను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. రిలయన్స్‌ వంటి సంస్థలు నిర్వహించే పెట్రోల్‌ బంకుల వ్యాపారంలోనూ సంఘాలను భాగస్వాములుగా చేస్తున్నామని సీఎం వెల్లడించారు. జిల్లా కేంద్రాల్లో, ముఖ్యమైన ప్రాంతాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్​లో పలు జిల్లాల సమాఖ్యలతో ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడారు. నారాయణపేట మహిళా సమాఖ్య సభ్యులు పెట్రోల్ బంక్ ద్వారా తాము ఇప్పటివరకు దాదాపు 27 లక్షల సంపాదించామంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం వారిని ప్రత్యేకంగా అభినందించారు. మహిళా సంఘాలు చేపడుతున్న కొన్ని వ్యాపారాల్లో నెలకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాయని అన్నారు.

ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా బ్యాంకులకు వందకు వంద శాతం రీపేమెంట్ చేసిన నిర్మల్ జిల్లా సమాఖ్య పరిధిలోని సంఘాలను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. మెయిన్ రోడ్డులో వారికి పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసే స్థలాన్ని కేటాయించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలోని మహిళా సంఘాలు ప్రతి రూపాయిని నిజాయితీగా తిరిగి చెల్లిస్తూ ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. పెద్ద వ్యాపారులు, పెద్ద సంస్థలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకుని ఎగ్గొట్టి పారిపోయిన ఉదాహరణలు ఉన్నాయని, కానీ ఇక్కడి మహిళా సంఘాలు ఆర్థిక క్రమశిక్షణలో వారికి గుణపాఠం నేర్పుతున్నాయని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు సారె లాగా ఇందిరమ్మ చీరలు అందజేస్తోందని సీఎం అన్నారు. గతంలో ఇచ్చిన చీరలు నాణ్యత లేక పంట పొలాల్లో పిట్టలను తరిమేందుకు ఉపయోగించారనే విమర్శలు వచ్చాయని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఇందిరమ్మ చీరలతో ఆడబిడ్డలు పాలపిట్టల్లా కనిపిస్తున్నారని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తామని, ఈసారి చిలుకపచ్చ రంగులో కొత్త డిజైన్‌ చీరలు ఇవ్వబోతున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn