ఊపందుకున్న సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణాలు

ఊపందుకున్న యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణాలు
* రాష్ట్ర వ్యాప్తంగా 105 నియోజకవర్గాల్లో స్కూళ్లకు ప్లాన్
* 87 చోట్ల వివిధ దశల్లో పాఠశాలల పనులు
* నిర్మాణాలకు రూ. 1,144.85 కోట్ల నిధులు విడుదల
హైదరాబాద్
విద్యా రంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనలేని ప్రాముఖ్యతనిస్తున్నారు. చదువుతోనే అన్ని రంగాల్లో మార్పు సాధ్యమని నమ్మిన సీఎం విద్యా శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని బాల,బాలికలకు నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల (YIIRS) ఏర్పాటుకు సీఎం శ్రీకారం చుట్టారు.
విద్యార్థుల్లో సమైక్యత, సమగ్రత చిన్నతనం నుంచే పెంపొందించాలనే భిన్నమైన ఆలోచనతో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాల విద్యార్థులందరినీ ఒకే చోట కలిపి కులమతాలకతీతంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేలా YIIRSలకు రూపకల్పన చేశారు. ప్రతి శాసనసభ
నియోజకవర్గంలో రెండు YIIRSలు నిర్మించనున్నారు. ఇందులో ఒకటి బాలికలకు, మరొకటి బాలురకు కేటాయిస్తారు. తొలి విడతలో 105 నియోజకవర్గాల్లో ఒక్కో YIIRS నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటికే 87 పాఠశాలలు నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగా, మిగిలిన 18 పాఠశాలలకు పరిపాలన అనుమతుల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. వీటి నిర్మాణాలకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,144.85 కోట్లు విడుదల చేసింది.
* ఆధునిక వసతులు
గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేలా YIIRSలకు రూపకల్పన చేశారు. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన-అభ్యసన సౌకర్యాలు, అత్యాధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, విశాలమైన డార్మిటరీలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా మైదానాలు, డైనింగ్ బ్లాక్‌లు, బోధన, బోధనేతర సిబ్బందికి నివాస గృహాలతో ఈ పాఠశాలలను నిర్మిస్తున్నారు.
* తక్కువ వ్యయంతో ..
ఇంజినీరింగ్ డిజైన్లు, ప్రస్తుత షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ను ఆధారంగా చేసుకుని YIIRS నిర్మాణ వ్యయ అంచనాలను పారదర్శకంగా రూపొందించారు. గతంలో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల కంటే తక్కువ నిర్మాణ వ్యయంతోనే అత్యాధునిక వసతులు కలిగిన ఈ విద్యాసంస్థలను నిర్మిస్తున్నారు. 20 నుంచి 25 ఎకరాల్లో నిర్మించే ఒక్కో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌లో సుమారు 2,650 మంది విద్యార్థులకు వసతి కల్పించనున్నారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం సుమారు 5.36 లక్షల చదరపు అడుగులు ఉండేలా ప్రణాళిక రూపొందించారు.
* శరవేగంగా నిర్మాణాలు..
ప్రభుత్వం తొలి దశల్లో 87 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. వీటిలో 79 పాఠశాలల నిర్మాణ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. వీటిలో 70 నియోజకవర్గాల్లో కాంట్రాక్టర్లు పాఠశాలల నిర్మాణ పనులు మొదలు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పనులు వేగంగా జరుగుతున్నాయి. పాలకుర్తి, ఆసిఫాబాద్, గజ్వేల్, ముధోల్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లోని YIIRSలకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
బోథ్, నిర్మల్ నియోజకవర్గాల్లో టెండర్ల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. శేరిలింగంపల్లి, సిర్పూర్, కామారెడ్డి, దుబ్బాక, సిరిసిల్ల, చంద్రాయణగుట్టలో పాఠశాలల నిర్మాణానికి అవసరమైన స్థలాలను ఇటీవలే కేటాయించారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన డీపీఆర్‌ల తయారీలో యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మహబూబ్‌నగర్, మిర్యాలగూడ, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల్లో అనువైన స్థలాల కోసం అన్వేషణ సాగుతోంది.
* 18 పాఠశాలల అనుమతులు త్వరలోనే
మొత్తం 105 నియోజకవర్గాల్లో ఇప్పటికే 87 పాఠశాలల నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగా, మిగిలిన 18 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రక్రియ కూడా వేగంగా ముందుకు సాగుతోంది. కోరుట్ల, జనగామ, హుజురాబాద్, కరీంనగర్, అలంపూర్, సిద్దిపేట, నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్, ఎల్బీ నగర్, మహేశ్వరం, సూర్యాపేట, ఉప్పల్, బాల్కొండ, నిజామాబాద్, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన అంచనాలు పూర్తయ్యాయి. ఈ పాఠశాలలకు త్వరలోనే
పరిపాలనపరమైన అనుమతులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. అనుమతులు లభించిన వెంటనే ఆ నియోజకవర్గాల్లోనూ టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
* కార్పొరేట్ కు దీటుగా..
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో విద్యా వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళుతోంది. పరిపాలన అనుమతులు, టెండర్లు, నిధుల విడుదల, నిర్మాణాల పురోగతి అన్నీ సమాంతరంగా సాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆధునిక విద్యా ప్రాంగణాలు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
#RevanthReddy #YoungIndiaSchools #YoungIndiaIntegratedSchools #YIIRS #TelanganaEducation #TelanganaSchools #TelanganaGovernment #EducationReforms #TelanganaNews #CMRevanthReddy
