వారిద్దరు కాంగ్రెస్ లోకే ..

1 min read

మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు కూడా తిరిగి సొంత గూటికి వెళ్లనున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన వీరిద్దరు కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరితో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా మూడు రంగుల జెండా కప్పుకోనున్నారు. జూపల్లి,పొంగులేటిని బీజేపీలో చేర్చుకోవడానికి ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది. చేరికల కమిటీ ఛైర్మన్ ఈటెల రాజేందర్ రెండు సార్లు వీరితో భేటీ అయ్యారు. కేసీఆర్ పైన పోరాటం విషయంలో బీజేపీని అనుసరిస్తున్న వైఖరీపైన పొంగులేటి,జూపల్లి అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో పాటు ఖమ్మం,మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆ పార్టీ బలంగా ఉండటంతో బీజేపీ వైపు చూడటానికి వీరు ఇష్టపడలేదు. సిఎం కేసీఆర్ పైన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గట్టిగా పోరాడుతుండటం, రాహుల్ గాంధీ మద్దతు ఆయనకు సంపూర్ణంగా ఉండటంతో వారికి కాంగ్రెస్ పైన విశ్వాసం పెరిగింది. స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి రాహుల్ గాంధీ టీం సర్దుబాటు చేయనున్నది.

టీడీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత వైసీపీలో చేరారు. వైఎస్ఆర్ సీపీ తరుపున ఖమ్మం ఎంపిగా 2014లో విజయం సాధించారు. ఆ తర్వాత మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే 2018లో పొంగులేటికి ఖమ్మం ఎంపి సీటు ఇవ్వడానికి కేసీఆర్ నిరాకరించారు. అప్పటి నుంచి అసంత్రుప్తిగా ఉన్న ఆయన ఖమ్మం బీఆర్ఎస్ కు పక్కలో బల్లెంగా మారారు. దీంతో ఆయన ఆ పార్టీ సస్పెండ్ చేసింది.

మరో వైపు కాంగ్రెస్ పార్టీ తరుపున రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జూపల్లి క్రిష్ణారావు వైఎస్ రాజశేఖర్ రెడ్డి,,రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా వ్యవహారించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి గుడ్ బై చెప్పి అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. 2014లో కొల్లాపూర్ నుంచి విజయం సాధించిన ఆయన కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రి గా పనిచేశారు. అయితే 2018లో కొల్లాపూర్ నుంచి ఓడిపోవడంతో బీఆర్ఎస్ లో జూపల్లి రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ తరుపున గెలిచిన హర్షవర్థన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో క్రిష్ణారావుకు మరింత గడ్డు పరిస్థితులను తెచ్చిపెట్టింది. దీంతో కేసీఆర్ వైఖరీపైన అసంత్రుప్తి వ్యక్తం చేస్తు బహిరంగ విమర్శలకు దిగారు. ఫలితంగా ఆయనను బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి తన రాజకీయ భవిష్యత్తుపైన జూపల్లి చర్చోపచర్చలు జరుపుతున్నారు. చివరకు కాంగ్రెస్ లో చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. కొల్లాపూర్ లో ఇప్పటికే కాంగ్రెస్ ఇంఛార్జీగా జగదీష్ రావు, యువనేత రంగినేని అభిలాష్ రావు పార్టీ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇప్పుడు జూపల్లి క్రిష్ణారావు కూడా కాంగ్రెస్ లోకి వస్తుండటంతో వీరిద్దరి రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా మారే అవకాశం ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn