కేటీఆర్ కు బహిరంగ లేఖ రాసిన మంత్రి అడ్లూరి

కేటీఆర్ గారు మీరు ఎండల నుంచి సేదతీరడం కోసం కుటంబ సమేతంగా మలేసియా వెళ్లినప్పటికి చాలా తీరక చేసుకుని తెలంగాణ గురించి ఆలోచిస్తు లేఖలు రాస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. మలేసియా పర్యటనలో మీరు అపరిమిత ఆనందాన్ని పొందుతున్నారని ఆశిస్తున్నాం. మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ కి మీరు రాసిన లేఖను ఎక్స్ లో చూశాం. మీ లేఖలో రాజ్యాంగం,నిరంకుశం,ఫాసిస్టు లాంటి పదాలు చూసి చాలా సంతోషపడ్డాం. అధికారం పోయాక మీకు భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గుర్తుకు రావడం ముదావం. తెలంగాణ ప్రజలు మీ నిరంకుశ పాలనను అంతం చేసి మిమ్మల్ని ఫామ్ హౌస్ లు, గెస్ట్ హౌస్ లకు పరిమితం చేశాక తమరికి ఫాసిస్టు అన్న పదానికి అర్థం తెలిసినట్లుంది. తల్లి సోనియమ్మ ఇచ్చిన తెలంగాణను కల్వకుంట్ల మకాన్ గా మార్చిన విషయం మీరు మరిచిపోలేదనుకుంటున్నాం. అమరుల బలిదానాల పునాదులపైన ప్రగతి భవన్ అనే గడీని నిర్మించుకుని ఇసుప కంచెల మధ్య తెలంగాణ తల్లి ని బంధించి తమరు పొందిన వికృతానందం మీ మొహం లో నిత్యం కనిపిస్తూనే ఉంటుంది.అహంకారానికి పర్యాయ పదం, ద్వేషానికి నిలువెత్తు నిదర్శనం, మోసానికి అసలు స్వరూపమైన మీ నాన్నగారి పక్కన నిలబడి మా రాహుల్ గాంధీ ని ప్రశ్నించే ధైర్యం చేసినందుకు మిమ్మల్ని అభినందించకతప్పదు
పదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ ప్రజల రక్తం,చమటను జుర్రుకుని తాగేసి ఆ బలుపుతో పార్టీ పేరు మార్చుకున్న తమరు మా పార్టీ పేరు మార్చమని చక్కటి సలహాలు ఇస్తున్నారు. మీ ప్రియతమ తండ్రిగారు నేను హిట్లర్ కాదు హిట్లర్ తాతను అని ఢంకా భజాయించి ,బల్లగుద్ది బలంగా ,కరాఖండిగా చెప్పిన విషయాలు మీ కర్ణభేరి కి తాకలేదా కేటీఆర్ గారు..? నేను హిట్లర్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడనని నీకు వచ్చిన, నచ్చిన ఇంగ్లీష్ లో విశదీకరించి చెప్పిన ఆడియో, వీడియో టేపులు కావాలంటే మీ విల్లాలోనైనా, ఫామ్ హౌస్ లోనైనా అందజేస్తాం. మీరు మాట్లాడితే అది శ్రవణానందం, మేం మాట్లాడితే కర్ణకఠోరమా..? మా ముఖ్యమంత్రి మాటలకు నీ మస్తిష్కాన్ని జోడించి కోడిగుడ్డుపైన ఈకలు పీకి రాజ్యంగరక్షకుడి అవతారమెత్తిన కేటీఆర్ గారు గురివింద గింజ తన కింద ఉన్న నలుపును ఎగరదట.. ఈ సామెత ను ఎప్పుడైనా విన్నారా..? మీకు తెలంగాణ ప్రజలు ఇప్పుడు విశ్రాంతి ఇచ్చారు. ఒక్క సారి పదేళ్ల మీ పాలన ను పునరావలోకనం చేసుకోండి. ఆత్మ అంటు ఉంటే ఆత్మపరిశీలన చేసుకోండి. అప్పుడు తెలంగాణ హిట్లర్ ఎవరో తెలంగాణ హితుడు ఎవరో తేలిపోతుంది..
