ఇదేం మీడియా…
1 min readకాంగ్రెస్ పైన తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆ పార్టీ ఎం.పి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విరుచుకుపడ్డారు. జర్నలిజం విలువలను కాలరాస్తు ఒక వ్యక్తికి, పార్టీకి అనుకూలంగా కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ప్రజలను అయోమయంలోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నారని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పటికైనా జర్నలిస్టులు తమ పంథాను మార్చుకోవాలని ఆయన ఫేస్ బుక్ లో సూచించారు.
జర్నలిజం విలువలను దిగజార్చుతూ కొన్ని వార్తా పత్రికలు, న్యూస్ ఛానళ్లు, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ఒక వ్యక్తికి అనుగుణంగా వార్తలు రాస్తూ ప్రజలను అయోమయానికి, గందరగోళానికి గురిచేస్తున్నారు. నిజాలను చెప్పాల్సిన జర్నలిస్టులు అబద్దాలనే నిజాలు అన్నట్లు ప్రచారం చేయడం జర్నలిజం విలువలకు వ్యతిరేకం. ఇప్పటికే ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తెలుసుకుని.. మీరు ప్రసారం చేసే వార్తలను నమ్మడం మానేశారు. అలాగే వీటితో విసిగి పోయారు. అసలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న విషయాలు ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వారు ప్రచారం చేయడం సరికాదు. ఇప్పటికైనా జర్నలిజం లక్ష్యానికి విలువను ఇస్తూ మీ పంథాను మార్చుకుని నిజాలు ప్రజాలకు తెలియజేయగలరు….కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
పీసీసీ అధ్యక్ష పదవిపైన కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపైన ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనాన్ని రాశారు. తెలంగాణ నాయకులను ఉద్దేశించి హైకమాండ్ పెద్దలు తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా అందులో పేర్కొన్నారు. వీళ్లేం నాయకులు అని వ్యాఖ్యానించినట్లు కథనంలో రాసుకొచ్చారు. కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవాలని ఒక నాయకుడు పార్టీ అధిష్టానానికి సూచించినట్లుగా అందులో రాశారు. దీనిపైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రజ్యోతి పేరు ఎత్తకుండా మీడియాకు సూచిస్తు ఆయన ఖండన ఇచ్చారు.