హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ..?
1 min read
హుజూరాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ త్వరలో వచ్చే అవకాశం ఉండటంతో పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. బీజేపీ తరుపున మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బరిలోకి దిగుతుండగా తాజాగా టీఆర్ఎస్ కూడా తన క్యాండిడెంట్ ను ప్రకటించింది. ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను తన అభ్యర్థిగా టీఆర్ఎస్ ఖరారు చేసింది. మరో వైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్న దానిపైన ఉత్కంఠ మొదలైంది. ఆ పార్టీ తరుపున గత ఎన్నికల్లో పోటీ చేసిన పాడి కౌషిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో ఇప్పుడు కాంగ్రెస్ కొత్త నాయకుడి కోసం వెతుకుతోంది. స్థానిక నేత పత్తి క్రిష్ణారెడ్డితో పాటు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ కవ్వం పల్లి సత్యనారాయణ పేరును పరిశీలిస్తోంది. అయితే బలమైన బీసీ అభ్యర్థిని పోటీలో దించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి కొండా సురేఖ పైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. బీసీ వర్గానికి చెందిన ఆమె కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తే బాగుంటుుందని మెజార్టీ నాయకులు భావిస్తున్నారు. కొండా సురేఖ పద్మశాలి సామాజికవర్గం కాగా ఆమె భర్త కొండా మురళీ మున్నూరు కాపు కులస్థుడు. దీంతో రెండు వైపుల నుంచి సానుకూలత వస్తుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే పోటీపైన కొండా సురేఖ అభిప్రాయం తెలియాల్సి ఉంది.