కాళేశ్వ‌రం పైన హైకోర్టు తీర్పు లో నిజాలు ఇవే..

కాళేశ్వరంపై ఈరోజు హైకోర్టులో వచ్చిన తీర్పు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు, అందుకు బాధ్యులైన వారెవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు. 
• జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.6 కొట్టివేయాలని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. కానీ  జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటును హైకోర్టు తప్పు బట్టలేదు. కమిషన్ నియామకాన్ని పూర్తిగా సమర్థించింది. 
• కమిషన్ ఫైండింగ్స్ ను కూడా హైకోర్టు తప్పుబట్టలేదు. కమిషన్ ఆఫ్ ఇంక్వయిరీ చట్టం 1952లోని సెక్షన్ 3 ప్రకారం GO.Ms.No.6 ద్వారా ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ రాజ్యాంగబద్ధమేనని కోర్టు స్పష్టం చేసింది. 
కమిషన్ ఏర్పాటు అధికార పరిధిని మించింది కాదు.. అసమంజసం కాదు, అక్రమం కాదు,  (Neither Arbitrary, Illegal nor Ultra Vires) అని కూడా స్పష్టం చేసింది. 
• జ్యుడిషియల్ కమిషన్ విచారణ నివేదికలో కొందరు బాధ్యులపై చేసిన నిర్దారణలపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. పిటిషనర్లకు నిర్ణీత ఫార్మాట్ ప్రకారం నోటీసు ఇవ్వలేదనే టెక్నికల్ అంశాన్ని తప్పుబట్టింది. జ్యుడిషియల్ కమిషన్ విచారణ నివేదిక ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవద్దని పిటిషనర్లకు రిలీఫ్ ఇచ్చినట్లు తెలిపింది. 
• ఇప్పటికే మా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలు, అవకతవకలపై సీబీఐతో విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే సీబీఐకు లేఖ రాసింది.
ఈ రోజు వెలువడిన హైకోర్టు తీర్పు సీబీఐ విచారణకు అడ్డంకి కాదు. హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు. 
• హైకోర్టు పూర్తి తీర్పును పరిశీలించిన తరువాత తదుపరి చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది
• కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది నిజం. ప్రాజెక్టుకు ఎంచుకున్న సైట్ నుంచి డిజైన్ల నుంచి నిర్మాణాలు, నిర్వహణ అన్నిచోట్ల అవకతవకలు జరిగాయి. అన్నీ లోపాలే ఉన్నాయి. 
• వారికి నోటిసులు ఇవ్వలేదనే కారణంగా,  వాళ్లపై కమిషన్ చేసిన రిమార్క్స్ మాత్రమే ఇన్ ఆపరేటివ్గా ఉంటాయని హైకోర్టు తెలిపింది.  ఇది పూర్తిగా ప్రొసిజరల్, టెక్నికల్ అంశం. 
కాళేశ్వరం ప్రజల కళ్లముందే కుంగిపోయింది. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ  బ్యారేజీ లో ఏడో బ్లాక్  కుంగిపోయింది. ఆ బ్యారేజీ దగ్గరికి వెళితే ఎవరికైనా కుంగిన తీరు కనబడుతుంది. 
లక్ష కోట్లతో కట్టిన బ్యారేజీ మూడేండ్లకే కుంగిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కట్టిన ప్రాజెక్టు వాళ్ల హయంలోనే కుంగిపోయింది. అందుకు కారణాలేమిటో తేల్చాల్చిన బాధ్యత.. మా ప్రజా  ప్రభుత్వంపై ఉంది. 
కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా బ్యారేజీల కుంగుబాటుకు దారి తీసిన కారణాలు, డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ లోపాలపై తమ ప్రాధమిక నివేదికను బీఆర్ఎస్ హయాంలోనే  సమర్పించింది.
బ్యారేజీలకు ఎంచుకున్న ప్రాజెక్టు సైట్ నుంచి డిజైన్లు, నిర్మాణంలో జరిగిన లోపాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిషన్  బయటపెట్టింది.
ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు, అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇంజనీర్లను, ఐఏఎస్ లను, అప్పటి పరిపాలనా బాధ్యులను విచారించి తమ నివేదికను వెల్లడించింది. 
బాధ్యులెవరు, దోషులెవరు.. ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి.. ఏమేం లోపాలున్నాయి.. ఎన్డీఎస్ఏతో పాటు విజిలెన్స్, పీసీ ఘోష్ కమిషన్  ఇచ్చిన నివేదికలపై ఆగస్ట్ నెలలోనే ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు పెట్టింది. 
విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, జస్డిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికల ఆధారంగా దర్యాప్తు జరపాలని సీబీఐ విచారణకు ప్రభుత్వం లేఖ రాసింది. గత ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఈ దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ జీవోతో పాటు నోటిఫికేషన్ జారీ చేసింది. 
హైకోర్టు తీర్పుతో సీబీఐ విచారణకు ఎలాంటి ఇబ్బంది లేదు. తీర్పు కాపీ వచ్చాక ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది. 
రెండేండ్లుగా ఆ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు అందలేదు. ప్రతి ఏడాది ఈ ప్రాజెక్టు పేరిట ప్రభుత్వం రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు అప్పులు, వడ్డీలు భరిస్తుంది. కేవలం రెండు ఫిల్లర్లు కాదు.. మొత్తం పౌండేషన్.. మొత్తం మూడు బ్యారేజీల పునాదులు అనుమానాస్పదంగా ఉన్నాయని ఇప్పటికే దేశంలో పేరొందిన సంస్థల నిపుణులందరూ అభిప్రాయపడ్డారు. 
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా మానవ తప్పిదం. దేశంలోనే ఇది అతి పెద్ద విధ్వంసం. అమూల్యమైన ప్రజాధనం వృథా అయింది. దీనికి బాధ్యులెవరో ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn