హైదరాబాద్ కు రండి.. సీఎం రేవంత్

ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలకు హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కేంబ్రిడ్జ్ ప్రతినిధులకు వివరించారు.హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు.కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్‌లో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని మార్కెటింగ్ చైర్ ప్రొఫెసర్ జైదీప్ ప్రభు, అదే సంస్థకు చెందిన ప్రొఫెసర్ వెంకట సిరీష్ గండికోట, ‘ఫ్రూగల్ ఏఐ’ కో-చైర్ తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న అవకాశాలపై వారు ప్రత్యేకంగా సానుకూలంగా స్పందించారు.
హైదరాబాద్‌లో విద్యా కార్యక్రమాలు నిర్వహించడం, సంయుక్తంగా పరిశోధనలు చేపట్టడం, యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ఇంక్యుబేషన్, స్టార్టప్‌ల అభివృద్ధికి సహకరించడం వంటి అంశాల్లో భాగస్వామ్యానికి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అంగీకరించారు.ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంతో తెలంగాణ భాగస్వామ్యానికి ఈ చర్చలు కొత్త మార్గం చూపనున్నాయి. హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్యా, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యానికి ఈ సమావేశం మరింత బలం చేకూర్చనుంది.
