నా కూతురు వ్యాఖ్య‌ల‌తో నాకు సంబంధం లేదు..కొండా సురేఖ

టిపిసిసి క్రమశిక్షణా కమిటీ జారీ చేసిన నోటీసుకు సంబంధించి అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు గురువారం తన వివరణతో లేఖను కమిటి ఛైర్మన్ మల్లు రవి గారికి పంపించారు. లేఖలో క్రమశిక్షణా కమిటీకి మంత్రి తన వివరణ ద్వారా స్పష్టతనిచ్చారు.

ఆగస్టు 19న తన జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘కొండా’ కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలుచోట్ల వేడుకలు నిర్వహించడంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టారని లేఖలో మంత్రి తెలిపారు. తన స్వస్థలమైన గీసుకొండతో తన కూతురు సుస్మితా పటేల్ కు వున్న ప్రత్యేక అనుబంధం కారణంగా అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో తన కుమార్తె కొండా సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారని వివరించారు.

ఆ కార్యక్రమంలో తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి స్పష్టం చేశారు. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, ఆ ప్రాతిపదికన వివరణ కోరడం సముచితం కాదని మంత్రి సురేఖ పేర్కొన్నారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని వివరించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ విషయంలో తన ప్రమేయం లేదని గుర్తించి, తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణా కమిటీకి గౌరవపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn