కేసీఆర్ కాళ్ల దగ్గర కార్యకర్తల ఆత్మగౌరవాన్ని జీవన్ రెడ్డి తాకట్టు పెట్టాడు..

మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 40 ఏండ్లు ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను మోసం చేసి,దుర్మార్గుడైన కెసిఆర్ తో జతకట్టారని ధ్వజమెత్తారు. జగిత్యాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతు జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడటం అత్యంత బాధాకరమని సీఎం వ్యాఖ్యానించారు.ఆయన వయసుకు,అనుభవానికి ఇది తగదన్న రేవంత్ రెడ్డి ఈనాటికీ నేను ఆయన గౌరవానికి భంగం కలిగేలా ఒక్క మాట మాట్లాడలేదని తెలిపారు. బీఆర్ఎస్ కుట్రలను తిప్పి కొట్టాలని ప్రయత్నం చేస్తుంటే ఆయన వెళ్లి అక్కడ చేరారన్నారు. ఎప్పుడూ జీవన్ రెడ్డి గారిని తక్కువ చేసి చూడలేదు, ఆయన మర్యాదను తగ్గించేలా మాట్లాడలేదన్నారు.ఆయన గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించలేదన్న సీఎం 2023 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం అంతా కష్టపడ్డామని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయన్ను కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించామని, కానీ ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేస్తానని కోరినా పార్టీ టికెట్ ఇచ్చిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు జీవన్ రెడ్డి ఓడిపోయారన్న సీఎం మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి గారు సూచించిన వారికే టికెట్లు ఇచ్చామని స్పష్టం చేశారు. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్ పైన హామీ ఇచ్చినా వినలేదని,మొండి పట్టుతో జీవన్ రెడ్డి గారు పార్టీ వీడారని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామంటే నిలబెట్టడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. మళ్లీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దామన్న ముఖ్యమంత్రి ధైర్యంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. త్వరలోనే కార్యకర్తలను కలిసేందుకు జగిత్యాలకు వస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
