గోదావ‌రి నీళ్లు ఎరుపెక్కాల‌న్న‌దే మీ ఆలోచ‌నా..?

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపైన ప్ర‌భుత్వ విప్ వేముల వీరేశం విరుచుకుప‌డ్డారు. ఇంకెంత కాలం తెలంగాణను పీక్కుతింటారని ఆయ‌న ప్ర‌శ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అమాయకుల ప్రాణాలను బలిగొన్నారని నిప్పులు చెరిగారు. కిరోసిన్ డబ్బా చూపించి ఉద్యమకారులను ఆత్మహత్యలకు పురికొల్పారని వేముల వీరేశం విరుచుకుప‌డ్డారు. దొంగ దీక్షలు చేసి తెలంగాణ బిడ్డలను వారి కుటుంబాలకు దూరం చేశార‌న్న సోనియమ్మ కాళ్ల మీద పడి, వెనుక నుంచి వెన్నుపోటు పొడిచారని ధ్వ‌జ‌మెత్తారు. సెంటిమెంట్‌పై అధికారంలోకి వచ్చి తెలంగాణ తల్లిని గడీలో బందీ చేశారని వేముల వ్యాఖ్యానించారు. నియంతలను తలదన్ని ప్రజాస్వామ్యాన్ని మీ పదఘట్టనలు కింద నలిపేశారని నిప్పులు చెరిగారు. కల్వకుంట్ల రాజ్యాంగంతో రాక్షస పాలన చేసి రక్తపిపాసులుగా మారార‌న్న ఆయ‌న
రైతులకు సంకెళ్లు వేసి నడిబజారులో నడిపించి వికటాట్టహాసం చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

 

నేరెళ్ల దళితులకు కరెంట్ షాక్‌లు పెట్టించి తెలంగాణకు కాళరాత్రులను పరిచయం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రగతి భవన్ ముళ్లకంచెల ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని చెరపట్టారని వేముల వీరేశం వ్యాఖ్యానించారు. కాసుల కక్కుర్తికి ఆశపడి సిరుల తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారన్న ఆయ‌న తెలంగాణ ప్రజల చైతన్యం ముందు కుప్పకూలి ఫామ్‌హౌస్‌లో బందీ అయ్యారన్నారు. అయినా మీ కుట్రలు ఆగలేదు, కుతంత్రాలకు అంతే లేదని ధ్వ‌జ‌మెత్తారు. ఏం కావాలి మీకు? పదేళ్లలో తాగిన తెలంగాణ రక్తంతో మీ దాహం తీరలేదా అని వేముల వీరేశం కేటీఆర్ ను ప్ర‌శ్నించారు. అధికార అహంకారంతో విర్రవీగి, విచ్చలవిడిగా అవినీతితో చెలరేగిపోయి అనకొండ స్థాయికి ఎదిగినా మీ ఆశ చావలేదా అని వీరేశం అన్నారు.

తెలంగాణ ప్రజల రక్తమాంసాలను పీక్కుతిన్నా మీ ఆకలికి అంతే లేదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఏం కావాలి మీకు? కాళేశ్వరం బ్యారేజీలు కొట్టుకుపోయి అమాయకుల ప్రాణాలు గోదావరిలో తేలాలా, పేదల రక్తంతో గోదావరి నీళ్లు ఎర్రగా మారాలా? అప్పుడే మీ కళ్లు చల్లబడతాయా అని వేముల వీరేశం వ్యాఖ్యానించారు. రైతుల పేరు చెప్పి రక్తచరిత్ర లిఖించాలని చూస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. రెచ్చగొట్టి రాజ్యంలోకి వచ్చి మరోసారి రాక్షస పాలనను రుచి చూపించాలని అనుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ చైతన్యం ముందు మీరిప్పటికే చరిత్రలో మిగిలిపోయారు, గుణపాఠాలు నేర్చుకోకపోతే కాలగర్భంలో కలిసిపోతారని కేటీఆర్ ను వేముల వీరేశం హెచ్చ‌రించారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn