నాకు అంతా సమానం..
1 min read
తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నామన్నారు. తెలుగు సినిమా ముఖ్యులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎనిమిది సినిమాలకు ప్రత్యేక ప్రోత్సహకాలు ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. ఐటీ, ఫార్మా తో పాటుగా మాకు సినిమా పరిశ్రమ కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు అనుసంధానకర్తగా ఉండేందుకు దిల్ రాజును ఎఫ్ డిసి ఛైర్మన్ గా నియమించామన్నారు. సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సమావేశంలో ప్రకటించారు. పరిశ్రమ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ లోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి సినిమా ప్రముఖులను కోరారు. కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ అన్న ఆయన హాలివుడ్,బాలీవుడ్ ఇక్కడికి వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణతో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలని ఆయన సూచించారు. సినిమా పరిశ్రమ కు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయన్న ఆయన సినిమా స్టూడియోలకు స్థలాలు, నిర్మాణాలు, నివాస స్థలాలు, ఫిల్మ్ నగర్, చిత్రపురి కాలనీ, కార్మికులకు ఇండ్లు, ఇతర సౌకర్యాలు కల్పించామన్నారు. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన భాద్యత నాది,నాకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో పాటు పలువురు సినిమా నటులు, దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు.