నీ లీగ‌ల్ నోటీసుల‌కు భ‌య‌ప‌డం…హ‌రీష్ రావుకు అద్దంకి ద‌యాక‌ర్ కౌంట‌ర్

హరీష్ రావుపై అద్దంకి దయాకర్ సంచలన ఆరోపణలు..

లీగల్ నోటీసులకు భయపడేది లేదన్న కాంగ్రెస్ నేత

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పకుండా లీగల్ నోటీసులు పంపించడం ద్వారా హరీష్ రావు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.

పీసీసీ అధ్యక్షుడితో పాటు తనను విమర్శించిన వారందరికీ లీగల్ నోటీసులు పంపుతున్నారని ఆయన అన్నారు. అయితే లీగల్ నోటీసులకు తాము చట్టపరంగానే సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో జైళ్లకు వెళ్లినా పోరాటం చేసిన తాము నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.

హరీష్ రావు క్షుద్రపూజలకు సంబంధించిన అంశంపై అమ్మవారి పేరుతో ప్రమాణం చేసి నిజం చెప్పాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని అన్నారు. గతంలో కూడా ఈ అంశంపై తమ వద్ద సమాచారం ఉండటంతోనే తాము స్పందించామని పేర్కొన్నారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పైనా ఆయన విమర్శలు గుప్పించారు. తాము తిరుచ్చి అఘోర కాళీ ఆలయం గురించి మాట్లాడుతుంటే, ఆయన ఘట్‌కేసర్ కాళీ ఆలయాన్ని ప్రస్తావించడం విచిత్రమని అన్నారు. రాజకీయ అంశాలపై ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

తాను చేసిన ప్రతి ప్రకటనలో చిత్తశుద్ధి ఉంటుందని అద్దంకి దయాకర్ అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన చరిత్ర తనకు ఉందని, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినంత మాత్రాన తాను భయపడబోనని స్పష్టం చేశారు.

హరీష్ రావుపై తనకు జాలి, సానుభూతి కూడా కలుగుతోందని అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల కుటుంబంలో ఆయనను పక్కన పెట్టారని, ఆ విషయం హరీష్ రావుకూ తెలుసని అన్నారు.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అద్దంకి దయాకర్ తెలిపారు. అలాంటి సమయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn