ప్ర‌ధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో స‌మావేశ‌మ‌య్యారు. సాగునీటి ప్రాజెక్టుల‌కు సంబంధించిన అనుమ‌తులు త్వ‌ర‌గా వచ్చేలా చూడాల‌ని ఆయ‌న కోరారు. మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహ‌రి కూడా ప్ర‌ధానితో స‌మావేశంలో పాల్గొన్నారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, ఖేలో ఇండియా గేమ్స్ కు ప్ర‌ధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు తెలంగాణలో నవంబర్ 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు హాజరుకావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. స‌మావేశానికి సంబంధించిన వివ‌రాల‌ను మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో మీడియాకు తెలియ‌జేశారు.

పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మసాగర్, డిండి ప్రాజెక్టులకు అనుమతులు

పాలమూరు–రంగారెడ్డి, సీతమ్మసాగర్, డిండి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని ప్రధానిని విజ్ఞప్తి చేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మూడు ప్రాజెక్టులపై గత, ప్రస్తుత ప్రభుత్వాలు కలిపి సుమారు రూ.50 వేల కోట్లు ఖర్చు చేశాయని వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా పర్యావరణ అనుమతుల దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా అనుమతుల జాప్యంతో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రధాని ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.

 

తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్రతో చర్చలు

తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల పూర్తిస్థాయి నీటిమట్టానికి మహారాష్ట్ర అంగీకారం తెలిపేలా చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరినట్లు ఉత్తమ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను పూర్తి గణాంకాలతో వివరించినట్లు చెప్పారు. అదనపు ముంపునకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని వెల్లడించారు.

సమ్మక్క–సారలమ్మ బ్యారేజీకి ఛత్తీస్‌గఢ్ ఎన్‌ఓసీ

సమ్మక్క–సారలమ్మ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నుంచి త్వరగా ఎన్‌ఓసీ ఇప్పించాలని ప్రధానిని కోరినట్లు మంత్రి తెలిపారు. ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి ముంపు నివేదిక తెప్పించామని, అదనపు డీపీఆర్ కోసం కోరిన మొత్తాన్ని కూడా జమ చేశామని వివరించారు.సమ్మక్క–సారలమ్మ డీపీఆర్‌ను సమర్పించిన నాటి నిబంధనల ప్రకారమే పరిశీలించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.నవంబర్ 16న కేంద్ర జల సంఘం చైర్మన్‌ను కలవనున్నట్లు, నవంబర్ 17న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి, తాను సమావేశం కానున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు.

 

నాలుగు సాగునీటి పథకాలకు రూ.5,856 కోట్లు కోరిన తెలంగాణ

2027–28 ఆర్థిక సంవత్సరంలో పీఎం కృషి సించాయీ యోజన కింద నాలుగు పథకాలకు రూ.5,856 కోట్ల నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.

  • సీతమ్మసాగర్–సీతారామ సమీకృత పథకం: రూ.5,183 కోట్లు
  • మోడికుంట వాగు: రూ.392 కోట్లు
  • చిన్న కాళేశ్వరం: రూ.178 కోట్లు
  • చనాకా–కొరాట: రూ.103 కోట్లు

ఈ నాలుగు ప్రాజెక్టులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.

సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అదనంగా రూ.5 వేల కోట్లు కోరాం

కేంద్రం రాష్ట్రాలకు రూ.2 లక్షల కోట్ల మేర 50 ఏళ్ల వడ్డీలేని రుణాలను ప్రకటించిందని ఉత్తమ్ తెలిపారు. మూలధన సాయం పథకం కింద తెలంగాణకు ఇప్పటివరకు రూ.1,457 కోట్లు అందాయని చెప్పారు.70 నుంచి 90 శాతం వరకు పూర్తయిన ప్రాజెక్టుల తుది పనుల కోసం అదనంగా రూ.5,000 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. ఈ నిధులు అందితే 2027 మార్చి 31లోగా ఖర్చు చేస్తామని, ఏడాదిలో కొత్త ఆయకట్టుకు నీరందిస్తామని తెలిపారు.

భూగర్భ జలాల పెంపునకు రూ.5 వేల కోట్ల ప్రత్యేక సాయం

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం, పడిపోతున్న భూగర్భ జలమట్టాల అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు ఉత్తమ్ తెలిపారు. కేంద్ర భూగర్భ జల మండలి సెప్టెంబర్ నివేదికను ప్రధానికి అందించినట్లు చెప్పారు.రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో భూగర్భ జలాలను పెంచేందుకు స్వల్ప, దీర్ఘకాలిక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. భూగర్భ జలాల పెంపు, పరిరక్షణ కోసం రూ.5,000 కోట్ల ప్రత్యేక కేంద్ర సాయం అందించాలని కోరినట్లు తెలిపారు.వచ్చే వానాకాలం వరకు తాగునీటికి సరిపడా నిల్వలను రిజర్వాయర్లలో ఉంచామని చెప్పారు. ఈ యాసంగిలో వరి సాగు చేయవద్దని రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను పరిశీలిస్తామని ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాదు

ప్రస్తుత పరిస్థితుల్లో మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాదని నిపుణులు తేల్చినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఒకే రకమైన సీకెంట్ పైల్ పునాదులు ఉన్నాయని, మూడు బ్యారేజీల పునాదుల రూపకల్పన, నిర్మాణంలో లోపాలున్నట్లు నిపుణుల నివేదిక పేర్కొందని వివరించారు.గత ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిందని, ప్రస్తుతం అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయాలని కోరడం అర్థరహితమని వ్యాఖ్యానించారు.ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసి, 30 శాతం పనులు పూర్తయిన తర్వాత ప్రాజెక్టును మేడిగడ్డకు మళ్లించారని ఆరోపించారు. కేవలం కమిషన్ల కోసమే గత ప్రభుత్వం ప్రాజెక్టును మేడిగడ్డకు మళ్లించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.దిగువ ప్రాంతాల్లో దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నామని మంత్రి తెలిపారు.

#RevanthReddy #PMModi #NarendraModi #UttamKumarReddy #VakitiSrihari #TelanganaNews #TelanganaPolitics #TelanganaGovernment #TelanganaIrrigationProjects #PalamuruRangareddy #Thummidihatti #SammakkaSaralamma #SeethammaSagar #MedigaddaBarrage #KaleshwaramProject #GodavariWaters #IrrigationProjects #TelanganaDevelopment #KheloIndiaYouthGames #CongressGovernment #NewDelhi #VSRBreakingNews #TeluguNews #BreakingNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn