కొడంగల్‌కు కృష్ణా జలాలు తెస్తాం.. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డ

లగచర్ల: కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి, పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లగచర్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ నాటికి కృష్ణా జలాలను తీసుకొచ్చి కొడంగల్ బీడు భూములను తడుపుతామని ప్రకటించారు. ఎవరు అడ్డొచ్చినా, అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ కొడంగల్‌కు కృష్ణా జలాలు తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోలేపల్లి ఎల్లమ్మ తల్లిపై ఒట్టేసి చెబుతున్నానని పేర్కొన్నారు.బూర్గుల రామకృష్ణారావు నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది పాలమూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా ఈ ప్రాంతంలో వలసలు ఆగలేదని సీఎం అన్నారు. ప్రాజెక్టులు పూర్తి కాలేదని, పొలాలకు నీళ్లు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పాలమూరు కష్టాలు తీరుతాయని ఆశించామని, అయితే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. పాలమూరు ప్రజలు భుజాలపై మోసిన కేసీఆర్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు.

కేసీఆర్ అప్పులకు ఏటా రూ.80 వేల కోట్లు చెల్లిస్తున్నాం
గత పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం రూ.8.11 లక్షల కోట్ల అప్పులు చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వం ప్రతి సంవత్సరం గత ప్రభుత్వ అప్పులకు సంబంధించిన చెల్లింపుల కోసం సుమారు రూ.80 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. గత 34 నెలల్లోనే రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పుల చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. తనకు అప్పులు చేసే అలవాటు లేదని, అబద్ధాలు చెప్పే అలవాటు అసలే లేదని వ్యాఖ్యానించారు.ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలను గుర్తించి 11 లక్షల మంది ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీనే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. 2024 జనవరి 1 నుంచి ప్రతి నెలా మొదటి తేదీన జీతాలు అందిస్తున్నామని చెప్పారు.
కేటీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు
మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను తమ ప్రభుత్వం ప్రారంభిస్తుంటే కేసీఆర్, కేటీఆర్ అడ్డుకుంటామని మాట్లాడుతున్నారని సీఎం విమర్శించారు. కేటీఆర్‌ను ఉద్దేశించి గడ్డం పెంచుకున్నంత మాత్రాన రేవంత్ రెడ్డి కాలేరని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కావాలంటే గుండె ధైర్యం, నమ్ముకున్న వారి కోసం నిలబడే తెగువ ఉండాలని అన్నారు. పది జన్మలు ఎత్తినా రేవంత్ రెడ్డి కాలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కొడంగల్‌లో రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులు
కొడంగల్‌లో రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామని సీఎం తెలిపారు. గతంలో ఉన్నత చదువుల కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.కొడంగల్ ప్రజలు తనకు అండగా ఉంటే ఢిల్లీలో ప్రధాని మోదీనైనా, కేడీనైనా ఎదుర్కొంటానని రేవంత్ రెడ్డి అన్నారు. నిరంతరం పనిచేసి తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత ప్రజాబలం పేరుతో ప్రజల్లోకి వస్తామని, ప్రజాబలంతో సునామీ సృష్టిస్తామని ప్రకటించారు. ఆ సునామీలో మోదీ, కేడీ కొట్టుకుపోతారని వ్యాఖ్యానించారు.ఎల్‌నినో ప్రభావాన్ని అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులు అధైర్యపడవద్దని, వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు.

#CMRevanthReddy #Kodangal #Lagacharla #TelanganaNews #TelanganaPolitics #KrishnaWater #PalamuruProjects #MNKProject #TelanganaDevelopment #CongressGovernment #KCR #KTR #BRS #RevanthReddySpeech #VSRBreakingNews
