20 కోట్ల ఓట్లు తొలగించేందుకు కుట్ర..సీఎం రేవంత్ రెడ్డి

** 20 కోట్ల ఓట్లు తొలగించేందుకు కుట్ర*
* పేదలు, దళితులు, ఆదివాసీలు, మహిళలపై కక్ష పెంచుకున్న ప్రధానమంత్రి
* మోదీని గద్దె దించేవరకు విశ్రమించం…
* కాంగ్రెస్ శ్రేణులను ఢిల్లీకి రాకుండా అడ్డుకోలేకపోయారు..
* ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
* తెలంగాణ నుంచి వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
* తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం…
ఢిల్లీ: కులాలు, మతాల పేరుతో ప్రజలను విభజించి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 2024 ఎన్నికల్లో 400 సీట్లు దాటితే రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని, దళితులు, గిరిజనులు, మహిళల ఓట్ల తొలగించాలని భావించారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీకి 400 సీట్లు దాటితే రాజ్యాంగం ద్వారా వచ్చిన ఓటు హక్కును తొలగిస్తారని ప్రజలు ఆ సంఖ్యను ఇవ్వకపోవడంతో పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలపై కక్ష పెంచుకున్న ముఖ్యమంత్రి ఓటు హక్కు తొలగింపునకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ఇండియా కూటమి ఆధ్వర్యంలో *ఓటు బచావో… దేశ్ బచావో* పేరుతో ఢిల్లీ రాంలీలా మైదాన్‌లో ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసం నుంచి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్రం నుంచి వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రితో కరచలనానికి పోటీ పడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ భారతదేశంలోని ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించారని, కానీ ఆ ఓటు హక్కును తొలగించేందుకు సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను అడ్డుపెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పటికే 13.50 కోట్ల ఓట్లు తొలగించారని, 20 కోట్ల ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మొత్తం ఓట్లలో 15 నుంచి 20 శాతం ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
ప్రయోగాత్మకంగా ఓట్ల తొలగింపు ద్వారా బీజేపీ ఇప్పటికే బీహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చిందని, ఢిల్లీలోనూ మరోసారి అలానే అధికారంలోకి రావాలని కుట్ర పన్నుతున్నారని సీఎం అన్నారు. ఈ కుట్రను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, ఇండియా కూటమి ఆధ్వర్యంలో రాంలీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని రాహుల్ గాంధీ నిర్ణయించారని తెలిపారు. సభకు తెలంగాణ నుంచి 15 వేల మంది వచ్చేలా పీసీసీ ఆధ్వర్యంలో రైళ్లు ఏర్పాటు చేస్తే, ఆఖరి నిమిషం వరకు నమ్మించి చివర్లో రైళ్లు రద్దు చేసి కార్యకర్తలు రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. రైళ్లు ఇవ్వకపోయినా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా ఢిల్లీ వచ్చారని, నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ కార్యకర్తల సంకల్పాన్ని అడ్డుకోలేకపోయారని అన్నారు. తెలంగాణ బలం ముందు, తెలంగాణ గళం ముందు మోదీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ తలవంచక తప్పలేదని సీఎం అన్నారు.
నాడు రావణుడిని ఓడించేందుకు రాముడికి వానర సేన తోడ్పడినట్లు, నేడు నరేంద్ర మోదీని ఓడించేందుకు కాంగ్రెస్ వానర సైన్యం పోరాడుతుందని, ఇందులో విజయం సాధించే వరకు విశ్రమించబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాంలీలా మైదానంలో కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకునే దీక్షతో నరేంద్ర మోదీ గద్దె కూలక తప్పదని, వాళ్లు గుజరాత్ వెళ్లక తప్పదని హెచ్చరించారు. రాంలీలా మైదాన్ లో ఇండియా కూటమి నేతలు ఇచ్చే సందేశాన్ని ప్రతి గ్రామానికి, ఇంటికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సీఎం సూచించారు.
* తెలంగాణ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి నేతలు ఫరూఖ్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్, మెహబూబా ముఫ్తీ, సంజయ్ రౌత్ లతో కలిసి ఓపెన్ టాప్ జీపులో రాంలీలా మైదాన్‌కు తరలివెళ్లారు. ర్యాలీలోనూ అంతకుముందు తెలంగాణ భవన్‌లోనూ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రితో సెల్ఫీలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు.
#RevanthReddy #20CroreVotes #VoteDeletion #CongressRally #DelhiCongressRally #ElectionCommission #TelanganaNews #VSRBreakingNews
