ఆ 45 ఎక‌రాల గుర్తింపున‌కు స‌ర్వే చేయండి…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఆ 45 ఎక‌రాల గుర్తింపున‌కు స‌ర్వే చేయండి…

* ఆ భూముల్లో తెలంగాణ అమ‌ర వీరుల కాల‌నీ ఏర్పాటు
* వెలిక‌ట్ట‌లో ఎడ్యుకేష‌న్ హ‌బ్‌
* మ‌ల్ల‌న్న సాగ‌ర్ నీరు అక్ర‌మ వినియోగ‌దారుల‌పై చ‌ర్య‌లు
* ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలో 45 ఎక‌రాల భూముల ఆచూకీ ల‌భ్యం కానుందున, వాటి గుర్తింపున‌కు వెంట‌నే స‌ర్వే నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. 22 ఏపై శాసనసభలో గత నెల 16వ తేదీన నిర్వ‌హించిన చర్చలో ఆ భూముల‌పై విచార‌ణ‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ విచారణ పురోగతిపై ఎంసీఆర్ హెచ్ ఆర్డీ బోధీ పెవిలియన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం రాత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. స‌మీక్ష‌లో ప్ర‌భుత్వ‌ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, భూ అక్రమాలపై విచార‌ణ‌కు వేసిన కమిటీ, ధరణి అక్రమాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా విచార‌ణ పురోగ‌తిపై సీఎం క‌మిటీ స‌భ్యుల‌ను ప్ర‌శ్నించారు. ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డుల్లో నమోదై ఉందని, కానీ తాజా సర్వేలో 343 ఎకరాల భూమి మాత్రమే ఉన్న‌ట్లు గుర్తించామ‌ని సీఎంకు అధికారుల వివ‌రించారు. రికార్డులో ఉన్న భూమికి, వాస్తవంగా ఉన్న భూమికి మధ్య 45 ఎకరాల వ్యత్యాసం ఉందని
అధికారులు తెలియ‌జేశారు. ఈ నేప‌థ్యంలో ఆ 45 ఎకరాల భూమిని తేల్చేందుకు ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వేకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. స‌ర్వే నెంబ‌ర్ 325 స‌మీపంలోనే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన కుటుంబ సభ్యులకు భూములు ఉన్నందున‌, వారి భూముల రికార్డులను సమర్పించాలని నోటీసులు జారీ చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా అధికారులు తెలిపారు.

సర్వే నంబర్ 325లో గుర్తించే భూమిని స్థానికంగా అర్హులైన రైతులకు పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అలాగే, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం ‘తెలంగాణ అమరవీరుల కాలనీ’ని నిర్మించాలని సీఎం ఆదేశించారు.అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో కాలనీని అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. కాలనీ నిర్మాణ బాధ్యతలను గృహ నిర్మాణ శాఖ‌కు అప్ప‌గించాల‌ని, వచ్చే జూన్ 2లోగా తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

కొండపాక మండలం వెలికట్ట గ్రామ పరిధిలో అసైన్డ్ భూములు, మిషన్ భగీరథ భూములు మినహా మిగిలిన భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్ తోపాటు ఎడ్యుకేష‌న్ హబ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఎల్‌నినో నేప‌థ్యంలో రిజ‌ర్వాయ‌ర్లు, చెరువుల నీటిని జాగ్ర‌త్త‌గా వినియోగించాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. మల్లన్న సాగర్ నీటిని అనధికారికంగా వినిగియోంచే వారిని గుర్తించి, త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

 

#RevanthReddy #CMRevanthReddy #Erravalli #45Acres #LandSurvey #Telangana #Siddipet #Markook #KCRFarmHouse #TelanganaNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn