ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు రెండు డీఏలు.. తెలంగాణ మంత్రి వ‌ర్గ ఆమోదం

తెలంగాణ రాష్ట్ర మంత్రి వ‌ర్గం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యంలో భేటీ అయిన క్యాబినెట్ దాదాపు నాలుగు గంట‌ల పాటు సుదీర్ఘంగా చ‌ర్చించింది.

1. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024 నుంచి బకాయి ఉన్న డీఏలలో రెండు డీఏలను వెంటనే మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి బకాయి పడ్డ ఎరియర్స్ ను వాయిదాల్లో చెల్లిస్తారు.

ఆర్థికంగా భారమైనప్పటికీ.. ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ మంజూరు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2500 కోట్ల భారం పడనుంది.

2. రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులపై కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది. రాష్ట్రంలో ఈ వానాకాలంలో దాదాపు 17 శాతం వర్షపాతం లోటు ఉంది. నిన్నటితో రుతుపవనాల కాలం కూడా ముగిసింది. దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయి.

కరువు ప్రాంతాల్లో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ లో చర్చించాలని నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. రైతు సంఘాలతో పాటు వివిధ రంగాల నిపుణులతో భేటీలు ఏర్పాటు చేస్తారు.

రాష్ట్రంలో ఉన్న ఎల్ నినో పరిస్థితులు.. చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై సలహాలు సూచనలు స్వీకరిస్తారు. కరువు మండలాల ప్రకటన తో పాటు రాష్ట్రానికి తగిన సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది. త్వరలోనే మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితి ని నివేదిస్తాం.

3. ఖరీఫ్‌ సీజన్ కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తారు. ఈ సీజన్లో దాదాపు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని సివిల్ సప్లయిస్ విభాగం అంచనా వేసింది. కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రివర్గం అధికారులకు సూచించింది.

4. ఎల్నినో పరిస్థితులతో రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో సాధారణంగా ఒక్క రోజుకు 15000 మెగావాట్ల విద్యుత్తు వినియోగం ఉండగా.. ఈ సీజన్లో అది రికార్డు స్థాయిలో 19892 మెగావాట్ల పీక్ డిమాండ్ కు చేరింది. అంటే దాదాపు 20 వేల మెగావాట్లకు చేరింది. గత ఏడాది మొత్తంలో 16613 మెగావాట్ల గరిష్ట వినియోగం నమోదైంది.

అందుకే విద్యుత్తు డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్తు ఉత్పత్తి, తగినంత విద్యుత్తు సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్తు కోత లేకుండా సరఫరా చేసేందుకు అవసరమైనంత విద్యుత్తును సమకూర్చుకోవాలని, డిమాండ్ మేరకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

భవిష్యత్తు డిమాండ్, అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్తగా పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి, విద్యుత్తు సమీకరణపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. దాదాపు 7800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంగా యూనిట్లు నెలకొల్పేందుకు ఆమోదం తెలిపింది.

ఇందులో 3,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు, 4000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌, 800 మెగావాట్ల పవన విద్యుత్తు యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించింది. కేంద్ర నిబంధనల మేరకు బిడ్డింగ్ విధానంలో ఈ ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది.

5. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో వరల్డ్ క్లాస్ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఈ మార్కెట్ ఏర్పాటు చేయాలని సూచించింది.

6. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పున: సమీక్షించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈపీసీ విధానంలో చేపట్టిన ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉంటే రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా 10 ఈపీసీ సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

7. తెలంగాణలో డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్‌కు ప్రత్యేక పాలసీ అమలు చేసే ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ రూపొందించిన డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ పాలసీకి అనుగుణంగా రాష్ట్రంలో ఈ పాలసీకి ఆమోదం తెలిపింది.

8. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పోస్టు మంజూరుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. మరో నలుగురు గ్రూప్ 1 అధికారులను కూడా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పని చేసేందుకు నియమించాలని నిర్ణయం తీసుకుంది.

 

#Telangana #DAHike #TelanganaEmployees #GovernmentEmployees #DearnessAllowance #TelanganaCabinet #CabinetDecisions #TelanganaNews #RevanthReddy #VSRBreakingNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn