స‌ర్..గో బ్యాక్ నినాదంతో ముందుకు వెళ్లాలి.. సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీలో అస్సాం దిన‌ప‌త్రిక *ప్ర‌తిదిన్‌* కాంక్లేవ్‌లో ఇండియాస్ నెక్ట్స్ చాఫ్ట‌ర్ అంశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌లు అంశాల‌పైన మాట్లాడారు.

* తెలంగాణలో విద్యార్థి సంఘాలు చాలా తక్కువ.. లెఫ్ట్, రైట్ సంఘాలున్నాయి. ఎన్ఎస్ఐయూ ప్ర‌భావం పెద్ద‌గా లేదు. ఉత్తర భారతదేశంలో, దక్షిణ భార‌త‌దేశంలో రాజ‌కీయాల శైలి వేరు… మా ద‌గ్గ‌ర యూనివ‌ర్సిటీ లా కాలేజ్‌, ఆర్ట్స్ కాలేజీ నాయ‌కునిగా ఏబీవీపీలో గెలిచిన వారు త‌ర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. యూనివ‌ర్సిటీలో విద్యార్థి సంఘంలో ఉన్నా, గ్రామానికి వెళ్లిన తర్వాత ఆ కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉంటుంది. తెలంగాణ‌లో బీజేపీకి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. స్టూడెంట్ రాజ‌కీయాల్లో ఏబీవీపీ ప్ర‌భావం ఉంటే.. రాజ‌కీయాల్లోకాంగ్రెస్ ప్ర‌భావం ఉంటుంది..

* నేను 2006లో జ‌డ్పీటీసీ స‌భ్యునిగా, 2007లో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచా. ఆ రెండు సార్లు నేను కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించా.. అక్క‌డ రెండు పార్టీలే ఉన్నాయి.. కాంగ్రెస్, తెలుగుదేశం. నాకు జిల్లాలో కాంగ్రెస్ నాయకులతో పెద్ద‌గా సంబంధాలు పెద్దగా లేవు.. ప్ర‌భుత్వంపై పోరాడాలంటే ప్ర‌తిప‌క్ష‌మే మేల‌ని భావించా.. అందుకే నేను తెలుగుదేశంలో చేరా.. ఆ పార్టీ నుంచి 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచా. 2017లో కాంగ్రెస్‌లో చేరాను. 2019లో ఎంపీగా గెలిచాను…

* రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత నాయ‌క‌త్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉండ‌డంతో తెలుగుదేశం పార్టీకి తెలంగాణ‌లో ప్రాధాన్యం త‌గ్గిపోయింది. మీరు మంచి నాయ‌కుడు, మీరు నాయుడుతో క‌లిసి ప‌ని చేస్తే తెలంగాణ‌లో ఇబ్బంది అని ప్ర‌జ‌లు చెప్పారు.. దాంతో నేను కాంగ్రెస్‌లో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నాను. తెలుగుదేశం కేంద్రంలో ఎన్డీఏతో ఉంది. ఏపీలో ఎన్డీఏ ఉంది. తెలంగాణ‌లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉంది. నేను రెండింటితో పోరాడాల్సి ఉంది.. రాహుల్ గాంధీ, దిగ్విజ‌య్ సింగ్‌, జైరాం ర‌మేశ్ తో పాటు నా శ్రేయోభిలాషులు కాంగ్రెస్‌లో ఉన్నారు… రాష్ట్రంలో 2014 ఎన్నిక‌ల త‌ర్వాత పోటీ కేసీఆర్‌, రేవంత్ మ‌ధ్య పోటీగా మారింది. ఆయ‌న న‌న్ను అనేక సార్లు జైలుకు పంపారు. నేను అసెంబ్లీకి క‌న్నా జైలుకే ఎక్కువ సార్లు పోయా… రాహుల్ గాంధీని క‌లిసిన త‌ర్వాత 15 నిమిషాలు మాట్లాడాం.. ఆ రోజే ఆయ‌న నా నాయ‌కుడి అని నిర్ణ‌యించుకున్నా… రాహుల్ గాంధీకి ఎటువంటి వ్య‌క్తిగ‌త అజెండాలు లేవు.. ఆయ‌న‌కు దేశ‌మే ముఖ్యం.. నేను విద్యార్థి సంఘంలో ఉన్నా.. నాయుడు పార్టీలో ఉన్నా దేశం, రాష్ట్రం కోసం ఏదైనా చేయాల‌నుకున్నా…

* యాంక‌ర్‌: కాంగ్రెస్ నుంచి అనేక మంది బీజేపీలో చేరుతున్న స‌మ‌యంలో మీరు కాంగ్రెస్‌లో ఎలా చేరారు?

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి: విద్యార్ఙి సంఘంలో ప‌ని చేశావు.. బీజేపీలో చేరితే గొప్ప నాయకుడివి అవుతావు.. తెలంగాణ‌లో ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంది. ఇత‌రుల‌తో పాటు కేసీఆర్ తో చేరితే మంత్రి అవుతావ‌ని చాలా మంది చెప్పారు. కానీ 70 ఏళ్ల త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ వ‌ల్ల‌నే మేం తెలంగాణ సాధించుకున్నాం. పెద్ద‌ద‌యిన ఆంధ్రప్ర‌దేశ్‌లో న‌ష్ట‌పోతామ‌ని తెలిసినా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. 175 శాస‌న‌స‌భ‌, 25 పార్ల‌మెంట్ స్థానాలున్నా రాష్ట్రాన్ని ఆమె త్యాగం చేశారు. తెలంగాణ ఏర్పాటుతో కాంగ్రెస్‌కు రాజ‌కీయ ప్ర‌యోజ‌నం లేదు… 1200 మంది యువ‌కుల ప్రాణ త్యాగాలు చేశారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను, ఆందోళ‌ల‌ను గౌర‌వించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన త‌ర్వాత ఆంధ్ర‌లో అక్క‌డి నాయ‌కులు కృత్రిమ ఉద్య‌మం తెచ్చారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వ‌లేదు. తెలంగాణ‌ అభివృద్ధి, సంక్షేమం, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌డం కోసం ఆమె తెలంగాణ ఇచ్చారు. ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వం కోసం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. ఆమె ఏ ల‌క్ష్యాల‌తో తెలంగాణ ఇచ్చారో వాట‌న్నింటిని కేసీఆర్ ప్ర‌భుత్వం తుంగ‌లో తొక్కింది. అందుకే నేను కాంగ్రెస్‌లో చేరాను. కేసీఆర్ ను ఓడించాను. తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు చోటు లేద‌ని కొంద‌రు అన్నా నేను కాంగ్రెస్‌లో చేరాను. నేను బ‌య‌టి నుంచి వ‌చ్చిన వ్య‌క్తిని అయినా అయిదేళ్ల‌లోనే కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడిని, ఎంపీని, పీసీసీ అధ్య‌క్షుడిని అయ్యాను. ముఖ్య‌మంత్రిని అయ్యాను. ఆ అవ‌కాశాల‌న్నింటిని కాంగ్రెస్ నాకు ఇచ్చింది.

* మ‌న‌కు స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్పుడు అక్ష‌రాస్య‌త 12.50 శాతం కూడా లేదు. పేద‌రికం, క‌ర‌వు ఉన్నాయి. అందుకే పండిట్ నెహ్రూ గారు విద్య‌, సాగు నీటి రంగానికి పెద్ద పీట వేశారు. అందుకే ఐఐఎంలు, ఐఐటీలు, యూనివ‌ర్సిటీలు ఏర్పాటు చేశారు. భాక్రాంనంగ‌ల్ మొద‌లు నాగార్జున సాగ‌ర్‌, శ్రీ‌శైలం, ఎస్సారెస్పీతో పాటు దేశ‌వ్యాప్తంగా ప్రాజెక్టులు నిర్మించారు. చిన్న చిన్న గ్రామాలు, ఆదివాసీ గూడేల్లోనూ పాఠ‌శాల‌లు తెరిచారు. తెలంగాణ‌లో 27 వేల పాఠ‌శాల‌లున్నాయి. 1,25,000 మంది ఉపాధ్యాయులున్నారు. ప్ర‌తి ఒక్కరికి విద్య‌ను అందించేందుకు ప్ర‌య‌త్నం చేశారు. త‌ర్వాత ఆరోగ్య రంగంపై దృష్టిసారించారు. స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్పుడు మ‌న స‌గ‌టు ఆయుర్దాయం 33 ఏళ్లు.. ఇప్పుడు 73 ఏళ్లు.. విద్యా, వైద్యం, సాగు అన్నింటికి నెహ్రూ గారు పునాది వేశారు. అక్క‌డి నుంచి క్ర‌మంగా మ‌నం అభివృద్ధి చెందాం.. అయితే ఇప్పుడు చ‌దువు ఉన్నా అందులో నాణ్య‌త లేదు. ఆహార ధాన్యాలు పుష్కలంగా ఉన్నా పౌష్టికాహారం ల‌భించ‌డం లేదు..మ‌నం ఇప్పుడు మ‌రో పెద్ద ముంద‌డుగు వేయాలి.. విద్యా విధానానికి సంబంధించి తెలంగాణ‌లో మీరు చూడండి. రెవెన్యూ, ఆర్థిక శాఖల‌పై చ‌ర్చ వ‌చ్చినా నేను వాటిని తీసుకోలేదు. విద్యా శాఖ‌ను తీసుకున్నా… భూ గ‌రిష్ట ప‌రిమితి చ‌ట్టం వ‌చ్చిన త‌ర్వాత తెలంగాణ‌లో 25 ల‌క్ష‌ల ఎక‌రాల‌ను ద‌ళిత‌, ఆదివాసీ, వెనుక‌బ‌డిన పేద కుటుంబాల‌కు పంచారు…ఇప్పుడు పంచ‌డానికి తెలంగాణ‌లో భూములు లేవు… సంక్షేమానికి ఎటువంటి వ‌న‌రులు లేవు.. చ‌దువుకున్నందునే అంబేడ్క‌ర్‌, మ‌న్మోహ‌న్‌సింగ్‌, అబ్దుల్ క‌లాం గొప్ప‌వాళ్ల‌య్యారు. చ‌దువుకున్న వాళ్లే ప్ర‌పంచంలో ఎద‌గ‌గ‌లిగారు. అందుకే మా రాష్ట్రంలో యువ‌త‌కు నాణ్య‌మైన విద్య‌, నైపుణ్యాలు అందించాల‌ని నిర్ణ‌యించా. ప్ర‌భుత్వ విద్య‌లో లోపాల‌ను గుర్తించా. దేశంలో స‌గ‌టున 30 మంది విద్యార్థుల‌కు 1 టీచ‌ర్ ఉంటే, తెలంగాణ‌లో 17 మంది విద్యార్థుల‌కు ఒక టీచ‌ర్ ఉన్నారు.. మేం దేశ స‌గ‌టు క‌న్నా మిన్న‌గా ఉన్నాం. అయినా ప్ర‌తి ఏటా ప్ర‌భుత్వ పాఠ‌శాలల నుంచి 50 నుంచి 60 వేల మంది ప‌క్క‌కు వెళుతున్నారు.. ఏటా టీచ‌ర్ల‌ను నియ‌మిస్తున్నాం. ఈ అంశంపై ప‌రిశీల‌న‌కు విద్యా క‌మిష‌న్ ను నియ‌మించా.. ఒక రిటైర్ ఐఏఎస్ అధికారి, ఒక యూనివ‌ర్సిటీ విద్యార్థి, ఇత‌ర ప్ర‌ముఖులు అందులో స‌భ్యులు. వారి విదేశాల్లో అధ్య‌య‌నం చేశారు. గ్రామాల‌కు వెళ్లారు. ఎందుకు మీరు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు పిల్ల‌ల‌ను పంప‌డం లేద‌ని త‌ల్లిదండ్రుల‌ను అడిగితే ఇంగ్లీష్ మీడియం లేదు, మీరు తెలుగు మీడియం చెబుతున్నారు.. మా పిల్ల‌ల‌కు ఇంగ్లీష్ మీడియం కావాల‌న్నారు.. ప్రైవేటులో న‌ర్స‌రీ ఉంటుంది.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఒక‌టో త‌ర‌గతి నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. నర్స‌రీ, ఎల్‌కేజీ, యూకేజీలో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఇది ఉండ‌దు. మేం పదో త‌ర‌గ‌తి త‌ర్వాత చ‌దివే విద్యార్థుల‌కు మేం ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇస్తున్నాం. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ కింద ఏటా రూ.2,500 కోట్లు ఇస్తున్నాం…కానీ ప్రైవేటు కాలేజీల్లో నాణ్య‌త ఉండ‌డం లేదు, లెక్చ‌ర‌ర్లు, ప్రొఫెస‌ర్లు ఉండ‌రు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn