విద్యుత్ శాఖ అధికారులపైన సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్: విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో సమీక్ష నిర్వహించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడంపై అధికారులను సీఎం, డిప్యూటీ సీఎం ప్రశ్నించారు.యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయి ఉత్పత్తికి జీ-9 రకం బొగ్గు అవసరమని అధికారులు సీఎంకు వివరించారు. అయితే సింగరేణిలో జీ-9 బొగ్గును ఉత్పత్తి చేసే బ్లాకులు లేవని, సమీప భవిష్యత్తులోనూ సింగరేణి నుంచి జీ-9 బొగ్గు ఉత్పత్తి అయ్యే అవకాశం లేదని అధికారులు తెలిపారు.జీ-9 బొగ్గు అందుబాటులో లేనప్పుడు ఆ సాంకేతికత ఆధారంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎలా నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ప్రశ్నించారు.అలాగే పిట్‌హెడ్ వద్ద కాకుండా బొగ్గు గనులకు దూరంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎందుకు నిర్మించాల్సి వచ్చిందని వారు ఆరా తీశారు. బొగ్గును సుదూర ప్రాంతాల నుంచి తరలించడం వల్ల రాష్ట్రంపై పడుతున్న అదనపు ఆర్థిక భారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నాటి ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే పిట్‌హెడ్ వద్ద కాకుండా దూరంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించిందని అధికారులు వివరించినట్లు సమాచారం. యాదాద్రికి బొగ్గు సరఫరా కారణంగా తెలంగాణ రాష్ట్రంపై సుమారు రూ.40 వేల కోట్ల అదనపు భారం పడుతోందని అధికారులు వెల్లడించినట్లు పేర్కొన్నారు.సింగరేణి నుంచి జీ-9 బొగ్గు సరఫరాకు ఉన్న అవకాశాలపైనా సీఎం, డిప్యూటీ సీఎం ఆరా తీశారు. గత ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకపోవడం వల్ల జీ-9 బొగ్గును సింగరేణి సరఫరా చేయలేకపోయిందని అధికారులు వివరించారు. సింగరేణిలో ఇప్పటికే 14 బొగ్గు బ్లాకులు మూతపడ్డాయని కూడా తెలిపారు.రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మహానది కోల్‌ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలుకు చర్యలు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.తక్షణమే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో చర్చించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Hashtags
#YadadriThermal #RevanthReddy #BhattiVikramarka #Singareni #G9Coal #TelanganaPower #TelanganaElectricity #YadadriPowerPlant #CoalIndia #MahanadiCoalfields #TelanganaNews #TelanganaBreakingNews #VSRBreakingNews
