కొండా సురేఖపైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు

మంత్రి కొండా సురేఖపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. ఆమె కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడంపై విరుచుకుపడ్డారు. తక్షణమే కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానాన్ని కోరారు. క్షమాపణ చెప్పకపోతే మంత్రి పదవి నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు.కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష కార్యాలయంలో ప్రభుత్వ విప్‌లు బీర్ల అయిలయ్య, వేముల వీరేశం నాయకత్వంలో దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు. కొండా సురేఖ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ఆమె పదేపదే తప్పుడు వ్యాఖ్యలతో పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారని ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు.గతంలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబంపై విమర్శలు చేసినప్పటికీ సంయమనంతో వ్యవహరించామన్నారు. అయినా ఆమెలో మార్పు రాలేదని ఎమ్మెల్యేలు అన్నారు. ఈసారి మాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్పై పదేళ్ల పాటు పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి అధికారంలోకి తీసుకువస్తే.. పదవులు అనుభవిస్తూ ద్రోహం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.పార్టీకి నష్టం కలిగించే వారు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించవద్దని ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్‌తో పాటు పీసీసీని కోరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, కొండా సురేఖ ఇలా ఎవరైనా వదిలిపెట్టొద్దని అన్నారు.కాంగ్రెస్ కార్యకర్తలు తమ రక్తం చిందించి పార్టీని అధికారంలోకి తీసుకువస్తే.. వారికి అన్యాయం చేసేలా కొందరు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు సహకరించేలా కొంతమంది తీరు ఉందని ధ్వజమెత్తారు. సమావేశంలో అందుబాటులో ఉన్న దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
