అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భేటీ

భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ తో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ మర్యాదపూర్వక భేటీ 30 నిమిషాలకు పైగా కొనసాగింది. ఈ సందర్భంగా వివిధ అంశాలు చర్చించారు. తెలంగాణలో విద్య, ఉపాధి, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాలను పెంచాలని, వీసా అపాయింట్మెంట్లు సకాలంలో లభించేలా సహకరించాలని కోరారు. వీసా ఇంటర్వ్యూ స్లాట్లను పెంచాలని, వీసా దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని కోరారు. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణ కు చెందిన వివిధ రంగాల నిపుణుల సమస్యలను కూడా రాయబారి దృష్టికి తీసుకెళ్లారు. H-1B వీసా ప్రాసెసింగ్, రెన్యువల్, వీసా స్టాంపింగ్ ఆలస్యం కాకుండా సరళతరం చేయాలని కోరారు. వీసా నిబంధనల్లో వచ్చే మార్పులపై ముందుగానే సమాచారం అందించాలని సూచించారు. అమెరికాలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల భద్రత, సంక్షేమంపై కూడా చర్చించారు. తెలంగాణలో అమెరికా సంస్థలకు విస్తృత పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఐటీ, కృత్రిమ మేధ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, స్టార్టప్‌లు, పరిశోధన, ఆధునిక సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. అమెరికా విశ్వవిద్యాలయాలు తెలంగాణ విద్యాసంస్థలతో కలిసి పనిచేసేలా సహకరించాలని కోరారు. విద్యార్థుల మార్పిడి, పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తరించాలని సూచించారు. అమెరికాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న భారతీయ భాషల్లో తెలుగు ఒకటని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. భారతదేశ చరిత్ర, సంస్కృతిపై రాయబారి సెర్జియో గోర్‌కు ఉన్న అవగాహన తనను ఆకట్టుకుందన్నారు. ప్రత్యేకంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలు, రాష్ట్ర బలాలపై రాయబారి చూపిన ఆసక్తిని ముఖ్యమంత్రి అభినందించారు. తెలంగాణ–అమెరికా మధ్య వ్యాపారం, పెట్టుబడులు, సాంస్కృతిక మార్పిడి, ప్రజల మధ్య సంబంధాలను మరింత విస్తరించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని రాయబారి సెర్జియో గోర్ హామీ ఇచ్చారు.
