ప్రణాళికబద్ధంగా హైదరాబాద్ అభివృద్ధి..సీఎం రేవంత్

ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ (CURE) మొత్తంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఆధునీకరణ, నగరీకరణతో సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించడానికి ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి గారు సమావేశంలో సవివరంగా ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు ఇతర సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు గారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పెరుగుతున్న నగరీకరణ వల్ల సమీప భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి గారు చెబుతూ, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

“హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. కీలకమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్‌ల వంటి మూడు విధానాల్లో ట్రాఫిక్‌కు సులభతరమైన రవాణా మార్గాలను కల్పించే విధానాన్ని ఎంచుకున్నాం.

ట్రాఫిక్ నియంత్రణ కోసం కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే చేపడితే సరిపోదు. బహుళ విధానాల్లో రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు నగరంలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం” అని వివరించారు.

“తెలంగాణ రాష్ట్రాన్ని CURE, PURE, RARE విభాగాలుగా అభివృద్ది చేయడానికి ప్రణాళికలు రూపొందించాం. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపలి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్‌గా గుర్తించాం. ఓఆర్ఆర్ బయట నుంచి రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పెరి అర్బన్ రీజియన్ ఎకానమి (PURE) ప్రాంతాన్ని ప్రధానంగా మాన్యూఫ్యాక్చర్ సెక్టార్‌గా గుర్తించాం.

ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు బయట ఉన్న రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE) గా వ్యవసాయం, దానిక అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలను సిద్ధం చేశాం” అని చెప్పారు.

“రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 మాస్టర్ ప్లాన్‌ను ఇప్పటికే ఆవిష్కరించుకున్నాం. లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. కాలుష్య కోరల నుంచి హైదరాబాద్‌ను కాపాడటానికి మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు నగర సంస్కృతికి అనుసంధానించబోతున్నాం.

నగరంలో కాలుష్య నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాం. హైదరాబాద్‌లో ఆర్టీసీలో ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నాం. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేయించి ఈవీ వాహనాలుగా మార్చాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం” అని ముఖ్యమంత్రి గారు చెప్పారు.

హైదరాబాద్ నగర తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, మూసీ పునరుజ్జీవం తదితర అంశాలపై ప్రభుత్వ ప్రణాళికలను సమావేశంలో ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్టాండింగ్ కమిటీకి వివరించారు. నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా ప్రభుత్వం స్టాండింగ్‌ కమిటీకి విజ్ఞప్తి చేసింది.

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయమని స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్‌తో పాటు ఇతర సభ్యులు అభివర్ణించారు. హైదరాబాద్ నగర జీవన స్థితిగతులను మెరుగుపరిచే మూసీ పునరుజ్జీవ తరహా ప్రాజెక్టు దేశంలోనే మొదటిదని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ నగర ప్రజలకు ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టును చేపట్టడంపై ఈ సందర్భంగా కమిటీ ముఖ్యమంత్రి గారిని అభినందించింది. దీంతో పాటు రాష్ట్రంలో మహిళాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కమిటీ ప్రశంసించింది. అంతకుముందు సమావేశం ప్రారంభంలో స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌తో పాటు సభ్యులను ముఖ్యమంత్రి గారు సత్కరించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదగడానికి అనుగుణంగా సమగ్ర ప్రణాళికలతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్‌ను స్టాండింగ్ కమిటీ సభ్యులకు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn