సస్పెండ్ చేసి పారేస్తా.. విద్యుత్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్

హైదరాబాద్: రాష్ట్రంలో పలు చోట్ల విద్యుత్ అంతరాయాలు ఏర్పడటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పలుమార్లు సూచించినప్పటికీ పరిస్థితిలో మార్పు ఎందుకు రావడం లేదని అధికారులను ప్రశ్నించారు.రాబోయే రోజుల్లో విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తిని ఎందుకు పెంచడం లేదని అధికారులపై సీఎం మండిపడ్డారు. బొగ్గు కొరత రాకుండా నైనీ, మహానది నుంచి బొగ్గు లింకేజీ ఏర్పాట్లు చేసినప్పటికీ యాదాద్రి విద్యుత్ ప్లాంట్లో సామర్థ్యానికి అనుగుణంగా ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని ఆరా తీశారు.
విద్యుత్ శాఖ అధికారులకు సీఎం హెచ్చరిక
ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతుల పంటలను కాపాడేందుకు అవసరమైన విద్యుత్ సరఫరా చేయాలని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను సహించేది లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ (స్పెషల్ సీఎస్), జెన్కో సీఎండీని కూడా సస్పెండ్ చేస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం.
విద్యుత్ అంతరాయాలకు కారణాలు చెప్పాలని ఆదేశం
రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఎందుకు ఏర్పడుతున్నాయో వెంటనే వివరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు సరఫరా, నిరంతర విద్యుత్ సరఫరాకు సంబంధించిన అంశాలపై అధికారులు తక్షణమే దృష్టి సారించాలని సూచించారు.ప్రత్యేకించి వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.
#RevanthReddy #CMRevanthReddy #TelanganaNews #PowerCuts #ElectricitySupply #YadadriPowerPlant #TelanganaGovernment #TelanganaBreakingNews #Farmers #VSRBreakingNews
