తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భరోసా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భరోసా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

• తెలంగాణలో ప్రభుత్వ విధానాలు స్థిరంగా కొనసాగుతాయి.. పెట్టుబడులు సురక్షితం

• రాబోయే రోజుల్లో తయారీ రంగం విస్తరణపై ప్రత్యేక దృష్టి

• ప్రపంచంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో తెలంగాణ పోటీ పడుతోంది

• తెలంగాణతో వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్యానికి బ్రిటన్ ప్రతినిధుల ఆసక్తి

• డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు బ్రిటన్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

 

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుందని, ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం కొనసాగుతుందని ముఖ్యమంత్రి శ ఎ. రేవంత్ రెడ్డి బ్రిటన్ వ్యాపార, పారిశ్రామిక ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. రాబోయే కొన్నేళ్లలో తయారీ రంగాన్ని భారీగా విస్తరించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పారు.బుధవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో బ్రిటన్‌లోని యార్క్‌షైర్ ప్రాంతానికి చెందిన మేయర్ల నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. సౌత్ యార్క్‌షైర్ మేయర్ ఆలివర్ కాపార్డ్, యార్క్ అండ్ నార్త్ యార్క్‌షైర్ మేయర్ డేవిడ్ స్కైత్, వెస్ట్ యార్క్‌షైర్ మేయర్ ట్రేసీ బ్రాబిన్ ఈ బృందానికి నాయకత్వం వహించారు.ఇటీవల భారత్–బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) నేపథ్యంలో తెలంగాణతో వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, విద్య, సాంస్కృతిక రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశంలో అత్యంత యువ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అనతికాలంలోనే ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, రక్షణ, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. తెలంగాణ ఇప్పుడు కేవలం దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా ప్రపంచంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతోందని చెప్పారు.డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026కు బ్రిటన్ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హాజరు కావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు.తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక ‘తెలంగాణ రైజింగ్–2047’ గురించి ముఖ్యమంత్రి వివరించారు. 2025 డిసెంబర్‌లో ఆవిష్కరించిన ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. అంతర్జాతీయ నాయకులు, ప్రముఖ ఆర్థికవేత్తలు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తల సూచనలతో ఈ అభివృద్ధి ప్రణాళిక రూపొందిందని తెలిపారు.

కృత్రిమ మేధ (AI) విస్తరిస్తున్న నేపథ్యంలో యువతకు ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ప్రముఖ కంపెనీల ప్రత్యక్ష భాగస్వామ్యంతో యువతకు శిక్షణ ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను త్వరలో ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. మూసీ నది పునరుజ్జీవం ద్వారా హైదరాబాద్‌లో రివర్‌ఫ్రంట్ ఎకానమీ, నైట్ ఎకానమీని అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికను వివరించారు.అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ 2025 మే నెలలో హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

ఈ సందర్భంగా బ్రిటన్ ప్రతినిధులు తెలంగాణతో అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, వైద్య ఆరోగ్యం, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, ఏరోస్పేస్, టెక్నికల్ టెక్స్‌టైల్స్, నైపుణ్యాభివృద్ధి, పరిశోధన రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ భాగస్వామ్యాన్ని ప్రత్యక్ష వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడులు, విద్యా సంస్థల మధ్య సహకారంగా మార్చేందుకు త్వరలో మరోసారి తెలంగాణలో పర్యటించాలని భావిస్తున్నట్లు తెలిపారు.సౌత్ యార్క్‌షైర్ మేయర్ ఆలివర్ కాపార్డ్ మాట్లాడుతూ, యార్క్‌షైర్ ప్రాంతంలో వివిధ రంగాలకు చెందిన సుమారు 1.50 లక్షల వ్యాపార సంస్థలు ఉన్నాయని తెలిపారు. దేశంలో అత్యధిక తలసరి జీఎస్‌డీపీ కలిగిన రాష్ట్రంగా తెలంగాణను ప్రస్తావిస్తూ, రెండు ప్రాంతాల ఆర్థిక ప్రయోజనాలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని చెప్పారు. తెలంగాణలోని డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, వ్యాపార విస్తరణ అవకాశాలు ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు.వెస్ట్ యార్క్‌షైర్ మేయర్ ట్రేసీ బ్రాబిన్ మాట్లాడుతూ, యార్క్‌షైర్, తెలంగాణ మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని, రెండు ప్రాంతాలు సోదర భావంతో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

అంతకుముందు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు బ్రిటన్ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను సందర్శించాలని ఆహ్వానించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, క్లీన్ ఎనర్జీ, నాలెడ్జ్ ఆధారిత ఆర్థికాభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు. ఉత్తర ఇంగ్లండ్ ప్రాంతానికి ఉన్న పారిశ్రామిక, సాంకేతిక సామర్థ్యాలతో తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలకు మంచి అనుసంధానం ఉందన్నారు.ఇటీవల ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం బ్రిటన్‌లో పర్యటించి ప్రముఖ విశ్వవిద్యాలయాలు, వ్యాపార సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు తెలంగాణ కేంద్రంగా ఎదిగే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘UK–India CETA & Regional Synergies’ పేరుతో యూకే–ఇండియా బిజినెస్ కౌన్సిల్ (UKIBC) రూపొందించిన నివేదికను ఆవిష్కరించారు.కార్యక్రమంలో యూకే–ఇండియా బిజినెస్ కౌన్సిల్ సీఈవో కిషోర్ జయరామన్, హైదరాబాద్ బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ ప్రతినిధులు, కె. రామకృష్ణారావు, ముఖ్యమంత్రి సలహాదారు సంజయ్ జాజు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

#RevanthReddy #TelanganaInvestments #InvestTelangana #GlobalSummit #TelanganaDevelopment #UKIndiaRelations #BritishDelegation #TelanganaGovernment #BusinessNews #TelanganaNews #VSRBreakingNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn